దేవాదాయ చట్టపరిధి నుంచి ఇరవై వేల ఆలయాలను తొలగించాలని, దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ అన్నారు. ఐదు లక్షల రూపాయల లోపు ఛలానా ఆదాయం ఉండే దేవాలయాలన్నింటినీ ప్రభుత్వ పరిధి నుంచి తప్పించాలని.. ఎండోమెంట్ చట్టంలోని ముఖ్యమైనటువంటి సెక్షన్లను అట్టి దేవాలయాలకు వర్తింపజేయకూడదని 1997లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన అన్నారు.
తాజాగా మే 5వ తేదీన ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్ రావు వెలువరించిన తీర్పు సారాంశం కూడా అదేనని గుర్తుచేశారు. ఐదు లక్షల రూపాయల లోపు ఉన్న దేవాలయాలను ప్రభుత్వ పరిధి నుండి, దేవాదాయ చట్ట పరిధి నుండి తొలగించాలని ఇచ్చిన తీర్సును స్వాగతిస్తున్నామని అన్నారు. చట్టం అందరికీ సమానమన్న ఆయన.. అదే తీర్పును అనగా దేవాదాయ చట్టపరిధి నుంచి చిన్న దేవాలయాలను తొలగించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.