పిల్లలను సవాళ్లు ఎదుర్కొనేలా సన్నద్ధం చేయాలి : గవర్నర్ తమిళిసై

Children should be prepared to face challenges. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ లో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

By Medi Samrat  Published on  9 Nov 2022 3:31 PM IST
పిల్లలను సవాళ్లు ఎదుర్కొనేలా సన్నద్ధం చేయాలి : గవర్నర్ తమిళిసై

హైదరాబాద్ : ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ లో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో బాలల హక్కులు, తెలంగాణలో సమకాలీన సవాళ్లు అంశంపై సదస్సు జ‌రిగింది. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ‌ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను గవర్నర్ నే కాదు.. ముందు అమ్మను, గైనకాలజిస్ట్‌ ని అని పేర్కొన్నారు. బాలికలు విద్యా సంస్థల్లో లైంగిక వేధింపులకు గురవుతున్నారని.. పిల్లలను సవాళ్లు ఎదుర్కొనేలా సన్నద్ధం చేయాలని పిలుపునిచ్చారు. బాలికలను మరింత జాగ్రత్తగా చూసుకోవాలి.. బాలికల్లో శారీరక, మానసిక మార్పులు సంభవిస్తుంటాయి.. పిల్లల మనస్తత్వం భిన్నంగా ఉంటుంది.. మన అభిప్రాయాలను వారిపై బలవంతంగా రుద్దకూడదని సూచించారు. ఈ కార్యక్రమం నిర్వహించిన ఎన్సీపీసీఆర్ ను అభినందించారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమానికి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ప్రియాంక్ కానూంగో, భారత్ నీతి వ్యవస్థాపకుడు మురళీధర్ రావు హాజరయ్యారు. భారత్ నీతి వ్యవస్థాపకుడు మురళీధర్ రావు మాట్లాడుతూ.. కుటుంబం అనేది ఒక ఇనిస్టిట్యూట్.. ఇది ముఖ్యమైంది అని పేర్కొన్నారు. పిల్లలు, వృద్ధులు, వాతావరణ సమస్యలపై కుటుంబంలో చర్చిస్తారు.. పిల్లలు భవిష్యత్తులో అనేక సవాళ్లు ఎదుర్కొబోతున్నారని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో పిల్లలు మద్యం, మాదక ద్రవ్యాలకు అలవాటు పాడుతున్నారని.. విద్య, క్రీడా, సామాజిక అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించాలని అన్నారు. భారత సమాజం సామాజిక విలువలు కలిగిన‌ది. కోవిడ్ సమయంలో ప్రధాని సమాజ రక్షణకు అనేక చర్యలు తీసుకున్నారు. ఇండియా ప్రపంచానికి రోల్ మోడల్ గా నిలుస్తోందని అన్నారు.




Next Story