పోలియో చుక్కలు వేయించుకున్న కొద్దిసేపటికే చిన్నారి మృతి

Child Died After taking Polio Drops. పోలియో చుక్కలు వేసుకున్న ఓ చిన్నారి మరణించడం తీవ్ర సంచలనం రేపుతోంది.

By Medi Samrat  Published on  1 Feb 2021 6:05 AM GMT
Child Died After taking Polio Drops
పోలియో చుక్కలు వేసుకున్న ఓ చిన్నారి మరణించడం తీవ్ర సంచలనం రేపుతోంది. పోలియో చుక్కలు వేసుకున్న కొద్దిసేపటికే ఆ చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందింది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌ పరిధిలో మహేశ్వరంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్టకు చెందిన యాదగిరి, మహేశ్వరానికి చెందిన రమీలకు ఏడాదిన్నర కిందట వివాహం అయింది. వీరికి రెండు నెలల కుమార్తె దీక్షిత ఉంది. ప్రస్తుతం తల్లి చిన్నారితో కలిసి పుట్టింట్లో ఉంటోంది. ఆదివారం ఉదయం శంభీపూర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారికి పోలియో చుక్కలు వేయించారు. వేసిన కొద్దిసేపటికి చిన్నారి అస్వస్థకు గురైంది. వెంటనే మియాపూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.


చిన్నారి మృతికి పోలియో చుక్కలే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ వెంకటేశం తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం చిన్నారి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మల్లిఖార్జున్‌ మాట్లాడుతూ.. పుట్టినప్పుడే కొంతమందికి గుండె ఊపిరితిత్తుల సమస్య ఉండవచ్చని, పోలియో చుక్కలు వికటించే అవకాశం ఏ మాత్రం లేదని స్పష్టం చేశారు. ఒక్కో సీసాలో 40 చుక్కలుంటాయి. ఈ పాపకు వేసిన తర్వాత మరో 17 మందికి వేశాము. ఎవరిలోనూ ఇలాంటి సమస్య తలెత్తలేదు. మృతికి ఇతర కారణాలు ఉండవచ్చని ఆయన అన్నారు.






Next Story