హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది. కండ్లకోయలోని సీఎంఆర్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్న వర్షిణి గురువారం నాడు కాలేజీకి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని ఇంటికి తిరిగిరాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిడ్ ఎగ్జామ్ కోసం కాలేజీ వద్ద వర్షిణిని సమీప బంధువు మోహన్ రెడ్డి డ్రాప్ చేశాడు. అనంతరం ఐడీ కార్డు, మొబైల్ ఇంట్లో మరిచిపోవడంతో కాలేజీ నుంచి విద్యార్థిని బయటకు వచ్చింది. సాయంత్రం అయినా విద్యార్థిని ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చివరిసారిగా విద్యార్థిని ఇన్‌స్టాగ్రామ్ ముంబైలో ఓపెన్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. పోలీసులు స్పెషల్ టీమ్‌లుగా ఏర్పడి విద్యార్థిని కోసం గాలిస్తున్నారు. కాలేజీకి వెళ్లిన తర్వాత ఆమె బయటకు వచ్చిన సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. కాలేజీ నుంచి బయటకు వచ్చిన ఆమె ఎటూ వెళ్లిందనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వర్షిణిని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురు ఆచూకీని త్వరగా కనుగోనాలని పోలీసులను వేడుకుంటున్నారు.