మహిళా జర్నలిస్టు రేవతి అరెస్ట్.. తీవ్రంగా ఖండించిన కేటీఆర్
ఇవాళ ఉదయం సుమారు 4 గంటల సమయంలో 12 మంది మఫ్టీ పోలీసులతో మహిళా జర్నలిస్ట్ రేవతి ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 12 March 2025 9:26 AM IST
మహిళా జర్నలిస్టు రేవతి అరెస్ట్.. తీవ్రంగా ఖండించిన కేటీఆర్
హైదరాబాద్: సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతిని ఇవాళ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం సుమారు 4 గంటల సమయంలో 12 మంది మఫ్టీ పోలీసులతో మహిళా జర్నలిస్ట్ రేవతి ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. జర్నలిస్ట్ రేవతి ఫోన్, ఆమె భర్త దర్శకుడు చైతన్య దంతులూరి ఫోన్, ల్యాప్‌టాప్‌ను కూడా పోలీసులు తీసుకెళ్లారు. జర్నలిస్ట్ రేవతికి సంబంధించిన పల్స్ యూట్యూబ్ ఆఫీస్‌ను పోలీసులు సీజ్ చేసినట్టు సమాచారం. రైతు బంధు రావట్లేదని ఒక రైతు మాట్లాడిన వీడియో ప్రసారం చేసినందుకు పెట్టిన కేసులో జర్నలిస్ట్ రేవతిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టును ఖండిస్తున్నాను.
— KTR (@KTRBRS) March 12, 2025
ఉదయం 5 గంటలకు ఇంటి మీద దాడి చేసి జర్నలిస్టు రేవతిని అక్రమంగా అరెస్ట్ చేయడం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎమర్జెన్సీ తరహా పాలనకు నిదర్శనం. @revathitweets పాటు యువ జర్నలిస్టు తన్వి యాదవ్‌ను అరెస్టు చేయడం దారుణం.
ఒక రైతు… pic.twitter.com/4mXy8LufOo
జర్నలిస్టు రేవతి అరెస్టును భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఉదయం 5 గంటలకి రేవతి ఇంటిపై దాడిచేసి ఆమెతోపాటు కుటుంబ సభ్యులను నిర్బంధించి ప్రభుత్వం వేధింపులకు గురిచేసిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తన కుటుంబంతో పాటు, తన పైన ఒత్తిడి చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని రేవతి స్వయంగా ఆరోపించిన నేపథ్యంలో.. ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవతితో పాటు యువ జర్నలిస్టు తన్వి యాదవ్ అరెస్టు చేయడం దారుణమని కేటీఆర్ అన్నారు.
ప్రజా ప్రభుత్వం అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి.. తెలంగాణను నియంతల రాజ్యంగా రేవంత్ రెడ్డి మార్చారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెల్లవారకముందే చట్ట వ్యతిరేకంగా మహిళా జర్నలిస్ట్ రేవతిని అరెస్టు చేసిన తీరు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో మీడియాపై విధించిన ఆంక్షలను, ఎమర్జెన్సీ నాటి దుర్మార్గపు రోజులను గుర్తుకు తెస్తున్నాయన్నారు. రాహుల్ గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధమైన పాలన ఇదేనా.. ప్రజా పాలనలో మీడియా స్వేచ్ఛ అనేదే లేకుండా పోయిందన్నారు. రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మీడియా మీడియా, సోషల్ మీడియా గొంతుకలపై చేస్తున్న ఈ దాడులను, అక్రమ కేసులను వెంటనే ఆపాలన్నారు.