సనత్ నగర్ నరబలి వెనుక సంచలన విషయాలు

Boy killed in Sanathnagar of Hyderabad. సనత్‌నగర్ బాలుడి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

By M.S.R
Published on : 21 April 2023 3:30 PM IST

సనత్ నగర్ నరబలి వెనుక సంచలన విషయాలు

సనత్‌నగర్ బాలుడి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇమ్రాన్ అనే ట్రాన్స్ జెండర్ బాలుడిని గొంతు నులిమి చంపడమే కాకుండా.. కరెంట్ వైర్‌తో మెడకు బిగించింది, ఎముకలు విరిచి బకెట్‌లో కుక్కింది. మజీద్ నుంచి ఇంటికి వస్తున్న అబ్దుల్ వహీద్‌ను తన ఇంట్లోకి పిలిచిన ఇమ్రాన్ ఓఆర్ఎస్ (ORS) తీసుకురమ్మని చెప్పింది. ఓఆర్ఎస్ తీసుకుని ఇంటికి వచ్చిన బాలుడు లోపలికి రాగానే హత్య చేసింది. సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటి వచ్చిన అబ్దుల్ వహీద్ నమాజ్ చేసేందుకు బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ఇమ్రాన్ అనే హిజ్రా పిలవడంతో బాలుడు ఆమెతో కలిసి వెళ్లాడు. వీరిద్దరు కలిసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాత్రి వెతికినప్పటికీ బాలుడి ఆచూకి లభించలేదు.

రాత్రి సమయంలో ఓ చోట క్షుద్రపూజలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న తల్లిదండ్రులు, స్థానికులు అక్కడకు వెళ్లి చూశారు. బాలుడి కోసం వెతకగా పక్కనే ఉన్న నాలాలో బాలుడి మృతదేహం లభించింది. అప్పటికే హిజ్రా ఇమ్రాన్ పరారీలో ఉంది. దీంతో బాలుడి మృతికి ఆమెనే కారణమంటూ హిజ్రా ఇంటిపై స్థానికులు దాడి చేసి ధ్వంసం చేశారు. అల్లాదున్ కోటి ఏరియా ప్రాంతంలో రాత్రంతా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనపై డీసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బాలుడు మిస్ అవగానే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గాలింపు మొదలుపెట్టామని, బాలుడిని చంపేసినట్లు గుర్తించామని వెల్లడించారు. ఇమ్రాన్ అనే ట్రాన్స్ జెండర్ బాలుడిని మర్డర్ చేసి ఆటో డ్రైవర్ సహాయంతో నాలాలో పడేశాడన్నారు. అబ్దుల్ వాహీద్‌ని నరబలి కాదని, ఫైనాన్షియల్ గొడవల వల్ల మర్డర్ జరిగిందని డీసీపీ చెప్పుకొచ్చారు. పోలీసులు ఇమ్రాన్, ఆటో డ్రైవర్ ఆలీతో సహా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తన కొడుకు హత్యలో ఇమ్రాన్‌కి ఆమె బంధువులు సలీం, జహంగీర్, ఇంతియాజ్, అర్బాజ్, షబానా సహకరించారని వహీద్ తండ్రి వసీం ఫిర్యాదులో పేర్కొన్నారు.


Next Story