సనత్‌నగర్ నాలాలో బాలుడి మృతదేహం.. నరబలి ఇచ్చారంటున్న బంధువులు
హైదరాబాద్ నగరంలోని సనత్‌నగర్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 8 ఏళ్ల వయస్సు గల బాలుడు హత్యకు గురయ్యాడు
By అంజి
సనత్‌నగర్ నాలాలో బాలుడి మృతదేహం.. నరబలి ఇచ్చారంటున్న బంధువులు
హైదరాబాద్ నగరంలోని సనత్‌నగర్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 8 ఏళ్ల వయస్సు గల బాలుడు హత్యకు గురయ్యాడు. అబ్దుల్ వహీద్ అనే బాలుడి మృతదేహం అల్లావుద్దీన్ కోటి ప్రాంతంలోని ఓ నాలాలో లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అమావాస్య కావడంతో బాలుడిని నరబలి ఇచ్చి, అక్కడే పడేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉంటున్న హిజ్రా బాలుడిని నరబలి ఇచ్చిందని ఆరోపిస్తూ, అతని ఇంటిపై బాలుడి బంధువులతో పాటు స్థానికులు దాడి చేశారు. హిజ్రా ఇంట్లో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లను గుర్తించారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురువారం సాయంత్రం నాలుగో తరగతి చదువుతున్న అబ్దుల్ వహీద్ (8) తప్పిపోయాడు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికితే ఆచూకీ లభించలేదు. వెంటనే బాలుడి తల్లిదండ్రులు సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాత్రి 8.30 గంటలకు బకెట్‌లో కుక్కి ఉన్న బాలుడి మృతదేహాన్ని జింకలవాడ నాలాలో స్థానికులు గుర్తించారు. దీంతో అక్కడికిచేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నాలా నుంచి వెలికితీశారు. బాలుడిని నరబలి ఇచ్చారా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.