ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడికి హైదరాబాద్ లింకులు
ఆస్ట్రేలియాలోని బౌండీ బీచ్‌లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By - Medi Samrat |
ఆస్ట్రేలియాలోని బౌండీ బీచ్‌లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాల్పులకు ఆల్పడ్డ ఉగ్రవాది సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు. అతడి దగ్గర హైదరాబాద్ పాస్‌పోర్టు లభ్యమైంది. ఈ నేపథ్యంలో సాజిద్ అక్రమ్ గురించి కీలక విషయాలను డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు.
సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌లో బీకామ్ పూర్తి చేసి స్టూడెంట్ వీసాపై 1998 నవంబర్‌లో ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడే యూరప్‌లోని ఇటలీకి చెందిన వెనీరా గ్రాసోను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు, ఒక కూతురు. ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత 2001లో తన వీసాను పార్టనర్ వీసాగా మార్చుకున్నాడు.. 2002లో రెసిడెంట్ వీసాను పొందాడు. సాజిద్ ఇప్పటికీ ఇండియన్ పాస్‌పోర్టు కలిగి ఉన్నాడని.. అతని పిల్లలకు మాత్రం ఆస్ట్రేలియా పౌరసత్వం ఉందని డీజీపీ వెల్లడించారు. సాజిద్ గడిచిన 25 ఏళ్లలో ఆరుసార్లు మాత్రమే ఇండియాకు రాగా.. 2017లో తండ్రి చనిపోయిన సమయంలో ఒకసారి హైదరాబాద్ వచ్చి వెళ్లాడని పేర్కొన్నారు. 2022లో హైదరాబాద్‌లోని టోలీచౌకీలో ఉన్న ఆస్తులను అమ్ముకొని వెళ్లినట్లు తెలిపారు. తెలంగాణలో సాజిద్‌పై ఎలాంటి క్రైమ్ రికార్డ్స్ లేవని వెల్లడించారు.
ఇటీవల సిడ్నీలోని ప్రఖ్యాత బాండీ బీచ్‌లో యూదులు హనుక్కా ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ అక్రమ్ (24) విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 15 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో సాజిద్ అక్రమ్ హతమవగా, అతని కుమారుడు నవీద్‌ను అధికారులు అరెస్టు చేశారు. ఇది ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రేరేపిత దాడి అని ఆస్ట్రేలియా అధికారులు భావిస్తున్నారు.