ఢిల్లీలో జరిగిన బాంబ్ పేలుడు ఘటన దేశాన్ని షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరో పెద్ద హెచ్చరిక వెలువడింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న రెండు అంతర్జాతీయ విమానాలకు ఒకేసారి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో విమానాశ్రయ భద్రతా విభాగం అప్రమత్తమైంది. అబుదాబి నుంచి శంషాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానం, లండన్ నుంచి శంషాబాద్ రావాల్సిన బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ విమానాలకు ఈ బెదిరింపు మెయిల్స్ చేరాయి. పరిస్థితి అత్యవసరంగా ఉండడంతో ఇండిగో విమానాన్ని వెంటనే ముంబై విమానాశ్రయానికి మళ్లించారు. లండన్ నుంచి బయల్దేరిన బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని షెడ్యూల్ కంటే ముందుగానే శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేయించారు.
ల్యాండింగ్ అనంతరం విమానంలోని ప్రయాణికులందరినీ అత్యవసరంగా దింపి, విమానాన్ని ఎయిర్‌పోర్టులోని ఐసోలేషన్ బేకు తరలించారు. అక్కడ బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లు సీఐఎస్ఎఫ్ పర్యవేక్షణలో గట్టి తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు తర్వాత శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. తరచూ బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో తనిఖీలను మరింత దృఢంగా చేపడుతున్నారు.