గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై పీడీయాక్ట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసు తదుపరి విచారణ సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు చేపడతామని ధర్మాసనం ప్రకటించింది. తన భర్తపై అక్రమంగా పీడీ యాక్ట్ పెట్టారంటూ రాజాసింగ్ భార్య హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానంలో కౌంటర్ సమర్పించింది. దాన్ని పరిశీలించిన న్యాయమూర్తి కేసును సోమవారానికి వాయిదా వేశారు.
అంతకు ముందు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ప్రివెంటీవ్ డిటెన్షన్ యాక్ట్ అమలుకు అడ్వయిజరీ బోర్డు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్‌ను సమర్థిస్తూ తీర్పు వెల్లడించింది. చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్న రాజాసింగ్‌పై నిబంధనల ప్రకారం ఏడాది కాలం పీడీ అమలు చేయాలని ఆదేశించింది. ఇచ్చిన తీర్పుపై రాజాసింగ్‌తరుఫు న్యాయవాది కరుణసాగర్ అభ్యంతరం వ్యక్తం చేసి.. బోర్డు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్తామన్నారు.