హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహమ్మద్ ప్రవక్తను కించపరిచే విధంగా రాజాసింగ్.. యూట్యూబ్‌లో వీడియోను విడుదల చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో నిరసనకారుల ఆగ్రహం పెల్లుబికింది. రాజాసింగ్ వివాదాస్పద ప్రకటన తర్వాత.. ఆయనను అరెస్ట్ చేయాలంటూ చాలా చోట్ల ఫిర్యాదులు అందాయి. రాజా సింగ్‌పై ఫిర్యాదు చేయడానికి డబీర్‌పురా, భవానీ నగర్, రెన్‌బజార్, మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్‌లకు ఆందోళనకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో రాజాసింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. మంగళవారం ఆయనను అరెస్ట్ చేశారు. రాజాసింగ్‌ను ఆయన ఇంటి వద్దే పోలీసులు అరెస్ట్ చేశారు.
మునావర్ ఫరూఖీ షో ను నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం నేతలు ఆరోపించారు. అర్ధరాత్రి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ముందు, పట్టణంలోని ఇతర ప్రాంతాలలో మజ్లిస్ నేతలు బైఠాయించి నిరసనలకు దిగారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేస్తూ.. ఆయన ఒక వర్గం మనోభావాలను దెబ్బతీశారన్నారు. అందుకే ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజాసింగ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేశారు.
అయితే బషీర్‌భాగ్ వద్ద నిరసన చేపడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. రాజా సింగ్ ఇటీవల ఒక వీడియోను అప్‌లోడ్ చేశారు. ఇందులో మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద ప్రకటన చేశాడు. ఇటీవల హైదరాబాద్‌లో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూకి షో జరిగింది. అయితే దానిపై రాజాసింగ్ ఓ కామిడీ వీడియో రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. అంతకముందు మునావర్ షోను అడ్డుకుంటామని రాజాసింగ్ బెదిరించారు. హిందువుల మనోభావాలను మునావర్ కించపరిచినట్లు రాజాసింగ్ తన వీడియోలో ఆరోపించారు. చివరకు పోలీసుల విజ్ఞప్తితో రాజా సింగ్ వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించారు.