జీహెచ్ఎంసీ మేయర్ కనిపించడం లేదు.. కాస్త వెతికి పెట్టరూ..!
By Medi Samrat
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కనిపించడం లేదని మల్కాజ్‌గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ఫిర్యాదు చేశారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని సమస్యలపై ఆమె శ్రద్ధ చూపడం లేదని, కనీసం కార్యాలయంలో కూడా అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. నగరంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ, మేయర్ వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆమె అందుబాటులో ఉండకపోవడంతో సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని అన్నారు. పలు ప్రాంతాల్లో మౌలిక వసతుల కొరత, చెత్త సమస్య, రోడ్ల దుస్థితి వంటి అంశాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు.
అయితే శనివారం నాడు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం మేయర్ అధ్యక్షతన జరిగింది. నూతనంగా ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యులకు మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఇలంబర్తి శాలువాతో సన్మానించారు. స్టాండింగ్ కమిటీ పాలసీ నిర్ణయాల కమిటీ అని, నిర్మాణాత్మక, ప్రజోపయోగమైన నిర్ణయాలు తీసుకుని నగర అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని మేయర్ కోరారు.