జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు.. బిర్యానీకి పెరిగిన గిరాకీ

Biryani Sales Rise In Hyderabad. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా దెబ్బ‌తిన్న హోట‌ల్ రంగం జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల పుణ్య‌మా

By Medi Samrat  Published on  25 Nov 2020 8:19 AM GMT
జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు.. బిర్యానీకి పెరిగిన గిరాకీ

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా దెబ్బ‌తిన్న హోట‌ల్ రంగం జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల పుణ్య‌మా అని పుంజుకుంటోంది. ఎల‌క్ష‌న్ క్యాంపెయిన్ మొద‌లు కావ‌డంతో.. బిర్యానీల‌కు డిమాండ్ పెరిగింది. లాక్‌డౌన్ వ‌ల్ల అంతంత మాత్రంగానే న‌డు‌స్తున్న హోట‌ల్ బిజినెస్‌.. ఇప్పుడు బ‌ల్క్ బిర్యానీ ఆర్డ‌ర్స్‌తో ఒక్క‌సారిగా పెరిగింది. ఎన్నికల ప్రచారం మొదలయ్యాక 80 శాతం బిజినెస్ జరుగుతోందని హోటళ్ల ఓనర్లు చెబుతున్నారు. మరికొన్ని రోజులు ఎన్నికల హడావుడి కొనసాగనుండటంతో బిర్యానీకి గిరాకీ ఇలానే ఉంటుందని అంటున్నారు.

ఎన్నికల ప్రచార సమయంలో కార్యకర్తలకు, మద్దతు దారులకు నాయకులు బిర్యానీ కొనిస్తుంటారు. చాలా మంది డబ్బుతో పాటు బిర్యానీ కూడా వస్తుందన్న ఆశతోనే ప్రచారంలో పాల్గొంటారు. దీంతో హోటళ్లకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. బల్క్‌గా ఇస్తున్న ఫుడ్‌ ఆర్డర్లతో పాటు హోమ్‌ డెలివరీలు సైతం భారీగా ఊపందుకున్నాయి. కరోనా కేసుల సంఖ్య కూడా తగ్గడంతో హోటళ్లకు వెళ్తున్న వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. లాక్ డౌన్ తో అద్దెలు కట్టలేక, సిబ్బందికి జీతాలివ్వలేక ఇబ్బందులు పడ్డ హోటళ్ల యజమానులు ఇప్పుడు ఖుషీ అవుతున్నారు.

నగరంలోని 150 డివిజన్లలో ప్రచారం చేసేందుకు హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాల నుంచి అన్ని ప్రధాన పార్టీల నేతలు వచ్చి ఇక్కడే మకాం వేశారు. పొరుగు జిల్లాల నుంచి ఆయా పార్టీలకు చెందిన కనీసం 5 వేల మంది చోటామోటా నాయకులు మందిమార్బలంతో హోటళ్లలో దిగారు. వీరందరికీ ఆయా పార్టీలు డివిజన్ల వారీగా హోటళ్లలో వసతి కల్పించడంతో అవన్నీ కళకళ్లాడుతున్నాయి. ప్రస్తుతం నగరంలో 80 శాతం హోటళ్లు తెరుచుకోగా, మునుపటిగా భోజనం ఆరంగించేందుకు వస్తున్న కస్టమర్లు 75 శాతానికి చేరుకున్నారు. ప్రధానంగా చికెన్, మటన్‌ బిర్యానీ ఆర్డర్లు పెరిగాయని హోట‌ల్ య‌జ‌మానులు తెలిపారు.


Next Story