విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన భోలక్‌పూర్ ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ గౌసుద్దీన్‌ను ముషీరాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గౌసుద్దీన్‌పై 353, 506 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆ కార్పొరేటర్‌ను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసు స్టేషన్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వివరాళ్లోకెళితే.. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోలక్ పూర్ లో సోమవారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో దుకాణాలు మూసి వేయాలని పోలీసులు కోరగా.. కార్పొరేటర్ గౌసుద్దీన్ సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు పట్ల దురుసుగా వ్యవహరించాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భొలక్ పూర్ కార్పొరేటర్ గౌసుద్దీన్ పోలీసుల పట్ల దురుసుగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో కార్పొరేటర్ గౌసుద్దీన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ.. గౌసుద్దీన్ ను అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినున్నట్లు తెలిపారు.