హుస్సేన్‌సాగర్‌ దగ్గర ఉద్రిక్తత.. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవకమిటీ సభ్యుల అరెస్ట్

Bhagyanagar Ganesh festival committee members arrested in Hyderabad. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ చెరువులో గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని

By అంజి  Published on  6 Sep 2022 5:59 AM GMT
హుస్సేన్‌సాగర్‌ దగ్గర ఉద్రిక్తత.. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవకమిటీ సభ్యుల అరెస్ట్

హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ చెరువులో గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నెక్లెస్‌ రోడ్డు నుంచి బైక్‌ ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే, పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదు. దీంతో భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ప్రతినిధులు, వారి మద్దతుదారులు బైక్ ర్యాలీని చేపట్టకుండా పోలీసులు అడ్డుకున్నారు. బైక్ ర్యాలీ నిర్వహించేందుకు అనుమతించకపోవడంతో బీజీయూఎస్‌ సభ్యులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

బీజీయూఎస్ ప్రధాన కార్యదర్శి భగవంతరావు తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే పలువురు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవకమిటీ సభ్యులను అరెస్ట్ చేశారు. అంతకుముందు భగవంతరావు మీడియాతో మాట్లాడుతూ.. హుస్సేన్‌సాగర్ చెరువులో విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తామని నెల రోజుల క్రితం తమతో నిర్వహించిన సమావేశంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. హుస్సేన్‌సాగర్‌ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

"నిమజ్జనం అనేది మతపరమైన వేడుక, రాజకీయ కార్యక్రమం కాదు" అని ఆయన పేర్కొన్నారు. నిమజ్జన ఏర్పాట్లను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీజీయూఎస్ బైక్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించినట్లు భగవంతరావు తెలిపారు. మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నగర వ్యాప్తంగా పీవోపీ వినాయక విగ్రహాల నిమజ్జనాల కోసం బేబీ పాండ్‌లను ఏర్పాటు చేసింది. నిమజ్జనం జరిగే చెరువుల వద్ద ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని జీహెచ్‌ఎంసీ చెప్పింది.



Next Story