వాలెంటైన్స్ డే అంటే కేవలం గులాబీలే కాదు.. ప్రమాద ఘంటికలు కూడా అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఆయన ఎక్స్‌లో చేసిన పోస్టులో.. సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్‌లో మీరు తోడు కోసం వెతుకుతుంటే.. సైబర్ కేటుగాళ్లు మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేయడానికి కాచుకుని ఉంటారని అలర్ట్ చేశారు.
సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్‌లో పరిచయం అయిన వెంటనే 'ఐ లవ్ యూ' చెప్పడం, విదేశాల్లో ఉన్నామంటూ గొప్పలు చెప్పడం, హఠాత్తుగా ఆపద వచ్చిందని నాటకాలాడటం.. ఇవన్నీ మిమ్మల్ని బుట్టలో వేసుకునే ఎత్తుగడలేనని.. అజ్ఞాత వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు, గిఫ్ట్ కార్డులు పంపొద్దని.. వీసా సమస్యలని, ఆసుపత్రి ఖర్చులని, కస్టమ్స్‌లో ఖరీదైన 'గిఫ్ట్' ఇరుక్కుపోయిందంటూ చెప్పే మాయమాటలు అస్సలు నమ్మొద్దు అని హెచ్చరించారు.
అనుమానం వస్తే వెంటనే స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడండి.. ప్రేమ కోసం వేచి చూడొచ్చు.. కానీ మోసగాళ్ల చేతిలో చిక్కి విలపించొద్దు.. జాగ్రత్త అంటూ అలర్ట్ చేశారు.