హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఆన్‌లైన్ బెట్టింగ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ‘X’ (ట్విట్టర్) వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.
క్రికెట్ క్రేజ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు, వ్యక్తులు డబ్బు కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. "టాస్ ఎవరు గెలుస్తారు? మ్యాచ్ ఎవరు గెలుస్తారు?" వంటి అంశాలను ముందే చెబుతామంటూ ప్రజలను నమ్మించి, వారిని బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఫేక్ ప్రిడిక్షన్ ఛానళ్ల మాటలు నమ్మి కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకోవద్దని సూచించారు.
ఇలాంటి మోసపూరిత ప్రకటనలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం ఉక్కుపాదం మోపుతోందని సజ్జనార్ తెలిపారు. గత నెల రోజుల్లోనే 494 పెయిడ్ అడ్వర్టైజ్‌మెంట్లను, 129 సోషల్ మీడియా ప్రొఫైళ్లను పోలీసులు బ్లాక్ చేశారని వెల్లడించారు. ఎవరైనా మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. మోసాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు.