హైదరాబాద్: సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లు కీలక పాత్ర పోషించాలని, ప్రజల సొమ్ముకు కాపలాదారులుగా ఉన్న వారు కస్టమర్ల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ పేర్కొన్నారు. ముఖ్యంగా డిజిటల్ అరెస్టులు లేదా పెట్టుబడి మోసాల బారిన పడినప్పుడు కస్టమర్లు తమ జీవితకాలపు సంపాదనను, డిపాజిట్లను హుటాహుటిన విత్‌డ్రా చేయడం లేదా బంగారంపై అప్పులు తీసుకోవడం వంటివి చేస్తుంటారని, అటువంటి సమయాల్లో బ్యాంక్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కస్టమర్ల ప్రవర్తనలో ఏవైనా అసాధారణ మార్పులు, ఆందోళన లేదా భయం కనిపిస్తే అది సైబర్ ముఠాల పని అయి ఉండవచ్చని అనుమానించి వెంటనే ఆరా తీయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తుచేశారు.
ముఖ్యంగా వృద్ధులు, పెన్షనర్లు మోసగాళ్ల మాయలో పడి మోసపోకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని, ఏవైనా అనుమానాస్పద లావాదేవీలను గమనిస్తే ఆలస్యం చేయకుండా పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి, డయల్ 100కి సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. ప్రజలు కూడా పోలీసుల హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకర్లు, పోలీసులు, ప్రజలు సమన్వయంతో చైతన్యవంతులైతేనే సైబర్ నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని సజ్జనార్ స్పష్టం చేశారు.