ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపడాన్ని నిరసిస్తూ శ్రీ రామ్ యువసేన గోషామహల్ నియోజకవర్గం బంద్ కు పిలుపునిచ్చింది. నియోజకవర్గంలోని మహారాజ్ గంజ్, ముక్తార్ గంజ్, కిషన్ గంజ్, ఉస్మాన్ షాహీ, అశోక్ బజార్, గౌలిగూడ, ఫిష్ మార్కెట్, సుల్తాన్ బజార్, బడిచౌడీ తదితర మార్కెట్లోని వ్యాపారులందరు స్వచ్చందంగా దుకాణాలు మూసివేసి బంద్ కు సంపూర్ణంగా మద్దతు పలికారు. దీంతో గోషామహల్ నియోజకవర్గం లోని అన్ని ప్రధాన కూడలిలలో ఎక్కడ చుసినా రోడ్లు అన్ని నిర్మానుష్యంగా మారాయి. మొత్తం మీద గోషామహల్ నియోజకవర్గం బంద్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది.
ఇదిలావుంటే.. రాజా సింగ్ ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. ఆగస్ట్ 25న పీడీ యాక్ట్ కింద రాజా సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. జైలులో రాజాసింగ్ భద్రతను మరింతగా పెంచారు అధికారులు. రాజాసింగ్ ను మానస బ్యారక్ నుంచి శారద బ్యారక్ లోకి మార్చారు. రాజాసింగ్ ను కలవడానికి ములాఖత్ కోసం వస్తున్న వారి గురించి ఆరా తీస్తున్నారు ఇంటెలిజెన్స్ అధికారులు. జైలులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను పెంచారు.