ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు

Bail Granted to MLA Rajasingh. ఎమ్మెల్యే రాజాసింగ్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

By Medi Samrat  Published on  23 Aug 2022 8:01 PM IST
ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు

ఎమ్మెల్యే రాజాసింగ్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజా సింగ్ రిమాండ్ ను కోర్టు రిజెక్ట్ చేసింది. 41 సీఆర్పీసీ కింద నోటీస్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ పిటిషనర్ తరపు లాయర్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ.. వెంటనే రాజా సింగ్ ను విడుదల చేయాలని ఆదేశించింది. కేసు ద‌ర్యాప్తులో పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని రాజా సింగ్‌ను ఆదేశించింది కోర్టు.

సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి 14వ అదనపు మెట్రో పాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో ధర్మాసనం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ మేరకు రాజాసింగ్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. రాజా సింగ్‌ను కోర్టులో హ‌జ‌రుప‌రిచేందుకు తీస‌కొస్తున్న క్ర‌మంలో కోర్టు వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటుచేశారు.

ఇదిలావుంటే.. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను గోషామ‌హ‌ల్‌ ఎమ్మెల్యే టి రాజా సింగ్‌ను బిజెపి అధిస్టానం మంగళవారం సస్పెండ్ చేసింది. పార్టీ విధానాల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడినందుకు స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. త‌క్ష‌ణ‌మే పార్టీలోని అన్ని బాధ్య‌త‌ల నుంచి త‌న‌ను తొల‌గిస్తున్న‌ట్లు పేర్కొంది. పార్టీ నుంచి ఎందుకు బ‌హిష్క‌రించ‌కూడ‌దో 10 రోజుల్లో స‌మాధానం చెప్పాల‌ని షోకాజ్ నోటీస్ జారీ చేసింది. సెప్టెంబర్ 2 లోగా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేను ఆదేశించింది.


Next Story