వీరరాఘవరెడ్డికి బెయిల్
చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన పూజారి రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు కె. వీరరాఘవరెడ్డికి బెయిల్ మంజూరైంది.
By Medi Samrat
చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన పూజారి రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు కె. వీరరాఘవరెడ్డికి బెయిల్ మంజూరైంది. రాజేంద్రనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 15 వేల రూపాయలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. రెండు నెలల క్రితం రంగరాజన్‌పై దాడి కేసులో రామరాజ్యం వ్యవస్థాపకుడు వీరరాఘవ రెడ్డి, ఇద్దరు మహిళలు సహా మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తమ సంస్థకు ఆర్థిక సాయం చేయాలని, రామరాజ్యంలో సభ్యులను చేర్పించాలని రంగరాజన్‌ను వీరరాఘవరెడ్డి డిమాండ్ చేశాడు. ఇందుకు రంగరాజన్ నిరాకరించడంతో దాడి చేశారు.
చిలుకూరు బాలాజీ ఆలయ సమీపంలోని రంగరాజన్ నివాసానికి వెళ్లి రామరాజ్యంకు మద్దతు ఇవ్వాలని కోరగా, అందుకు ఆయన నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. సీఎస్ రంగరాజన్‌పై దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని పోలీసులు విచారించారు. 2014-15లో రెండో తరగతి చదువుతున్న తన కుమార్తెను డిటెన్షన్ చేయడంతో అధికారులు, న్యాయ, ప్రభుత్వ వ్యవస్థలతో పోరాడానని, అయినా న్యాయం జరగలేదని వీరరాఘవరెడ్డి విచారణలో తెలిపాడు. కొత్త వ్యవస్థను తయారు చేసి.. దానికి తానే అధినేతగా ఉండాలని భావించాడు. రామరాజ్యం ఆర్మీని ఏర్పాటుకు సహకరించాలని కోరగా రంగరాజన్ అంగీకరించలేదు. మరోసారి ఆయనను కలిసి తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించానని, ఆయన నుంచి వ్యతిరేకత ఎదురుకావడంతో దాడికి పాల్పడినట్లు పోలీసులకు వివరించాడు వీరరాఘవరెడ్డి.