తెలంగాణ పోలీసులు మాపై కేసులు పెడితే.. మేము పేటీఎం పై కేసు పెడతాం : అజారుద్దీన్

Azharuddin's Backfoot Defence On Hyderabad Ticket Stampede. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ హైదరాబాద్ లో నిర్వహిస్తూ ఉన్న సంగతి తెలిసిందే

By Medi Samrat  Published on  23 Sep 2022 2:45 PM GMT
తెలంగాణ పోలీసులు మాపై కేసులు పెడితే.. మేము పేటీఎం పై కేసు పెడతాం : అజారుద్దీన్

భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ హైదరాబాద్ లో నిర్వహిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఆదివారం జరగబోయే ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకాలకు సంబంధించి హైదరాబాద్ జింఖానా మైదానం వద్ద తొక్కిసలాట జరిగింది. హెచ్ సీఏ పరువు తీసింది. ఉప్పల్ స్టేడియంలో సీటింగ్ కెపాసిటీ 55వేలు. మ్యాచ్ కు అనుమతించేది 34వేల మందిని మాత్రమే. అందులోను ఆటగాళ్లకు, స్పాన్సర్లకు 4500 టికెట్లు ఇచ్చారు. అమ్మాల్సిన టికెట్లు 29,500 ఉన్నాయి. కానీ ఆఫ్ లైన్ లో కేవలం 2వేల టికెట్లను మాత్రమే అమ్మారని తీవ్ర విమర్శలు వచ్చాయి. మిగతా టికెట్లు ఏమయ్యాయని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

తాజాగా అజారుద్దీన్ మీడియా ముందుకు వచ్చారు. తాము ఆన్ లైన్ లోనే ఎక్కువ భాగం టికెట్లను అమ్మేశామని అజారుద్దీన్ చెప్పారు. జింఖాన దగ్గర ఏం జరిగిందో పోలీసులకు తెలుసన్నారు. గతంలోనూ ఇలాగే జరిగింది… ఇప్పుడూ అలాగే జరుగుతోందన్నారు. ఆ బాధ్యతంతా పోలీసులు చూసుకోవాలన్నారు. బ్లాక్ లో టికెట్లు అమ్మారనేది అవాస్తవమన్నారు. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతోందన్నారు. ఈనెల 15న పేటీఎం ద్వారా 11,450 టికెట్లు విక్రయించామన్నారు. కాంప్లిమెంటరీ పాసులు ఏవీ లేవన్నారు. డైరెక్ట్ కార్పొరేట్ టికెట్స్ 6000 ఉన్నాయన్నారు. టికెట్ల అమ్మకం కాంట్రాక్ట్ పేటీఎంకు ఇచ్చామన్నారు. తాను ఏ తప్పు చేశానో చెప్పాలన్నారు. టికెట్ల అమ్మకంలో ఎలాంటి గందరగోళం జరగలేదన్నారు. తెలంగాణ పోలీస్ లు మాపై కేసులు పెడితే… మేము Paytm పై కేసు పెడతామని వార్నింగ్‌ ఇచ్చారు. టికెట్ల అమ్మకాల్లో అసలు ఎలాంటి గందరగోళమూ లేదని.. కొందరు కావాలనే తమపై దుష్ప్రచారం చేశారని చెప్పారు. టికెట్ల అమ్మకాల్లో తమ తప్పు ఏమీ లేదని అజారుద్దీన్ మరోసారి అన్నారు. బ్లాక్ లో టికెట్లు అమ్మేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.




Next Story