రోడ్డుపై మూడు ఆటోలతో ప్రమాదకర స్టంట్లు చేస్తూ ఇతర వాహనదారులను భయపెట్టారు. ఆటోలను ఓవైపు వంచేసి రెండు టైర్లపై నడుపుతూ నానా హంగామా చేశారు. ఈ ఘటన హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పరిధిలో చోటు చేసుకుంది. పలు ఆటోలు గురువారం రాత్రి డ్రాగ్ రేస్‌లో పాల్గొన్నాయి. నగరంలోని సౌత్ జోన్‌లోని సంతోష్ నగర్ పిసల్ బండ క్రాస్‌రోడ్ నుండి చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్ మధ్య డ్రాగ్ రేస్ జరిగింది. ఈ ఘటన మొత్తం కెమెరాలో చిక్కడంతో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రతి రాత్రి ఇలాంటి ఆటోల పందేలు నిర్వహిస్తూ రోడ్లపై గందరగోళం సృష్టిస్తున్నారని స్థానికులు చెప్పారు. ఇలాంటి పందేల సమయంలో కూడా బెట్టింగ్‌లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇలాంటి వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని పొరుగు ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. పోలీసులు ఈ విషయాన్ని గ్రహించి అక్రమార్కుల కోసం వెతకడం ప్రారంభించారు.
ఆ స్టంట్లను వీడియో తీసి ఓ నెటిజన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు స్పందించారు. ప్రమాదకర విన్యాసాలు చేసిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. టోలీచౌకీకి చెందిన సయ్యద్ జుబేర్ అలీ (20), సయ్యద్ సాహిల్ (21), మహ్మద్ ఇబ్రహీం (22), మహ్మద్ ఇనాయత్ (23), గులాం సైఫుద్దీన్ (23), మహ్మద్ సమీర్ (19), అమీర్ ఖాన్ (20) అనే యువకులు ఆటోలను అద్దెకు తీసుకుని నడుపుతుంటారని, గురువారం అర్ధరాత్రి బాబానగర్ నుంచి డీఆర్డీఎల్.. మళ్లీ అక్కడి నుంచి బాబానగర్ కు వస్తూ విన్యాసాలు చేశారని పోలీసులు తెలిపారు.