కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా టీకా పంపిణీ చేస్తున్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకా వేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇందుకోసం ఏప్రిల్ 28 నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. తాను ముందుగానే బుక్‌చేసుకున్నాక టీకా ఎలా అయిపోతుందని నర్సుతో ఓ ఐటీ ఉద్యోగి వాగ్వాదానికి దిగాడు. నర్సుపై చేయి చేసుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోని వెల్‌నెస్ కేంద్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. గచ్చిబౌలికి చెందిన ఐటీ ఉద్యోగి రాజేశ్(24) టీకా వేయించుకునేందుకు బుధవారం సాయంత్రం 4.15 వెల్‌నెస్ కేంద్రానికి వచ్చాడు. సమయం ముగిసిందని నర్సు చెప్పగా.. తాను ముందుగా బుక్ చేసుకున్నాక ఎలా అయిపోతుందని వాగ్వాదానికి దిగాడు. టీకా అయిపోయిందని.. తామేమి చేయలేమని ఆమె చెబుతుండగా.. వీడియో తీసేందుకు యత్నించాడు. వీడియో తీయకుండా అడ్డుకోబోగా.. నర్సు చేయిపట్టుకుని ముఖాన్ని గట్టిగా నెట్టివేశాడు. దీంతో ఆమె నోటిపై గాయమైంది. అక్కడే ఉన్న మిగతా సిబ్బంది అతడిని అడ్డుకోగా.. వారిని అసభ్య పదజాలంతో దూషించాడు.
నర్సు ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. సిబ్బందిపై దాడికి నిరసనగా గురువారం విధులు బహిష్కరిస్తున్నట్లు నర్సులు తెలిపారు.