హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ ఆస్తులు రూ.250 కోట్లపైమాటే

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నెలలో అరెస్టయిన హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రూ.250 కోట్ల మేరకు ఆస్తులు కూడబెట్టినట్లు వెల్లడైంది.

By అంజి  Published on  8 Feb 2024 6:51 AM IST
HMDA, ex director,Arrest,  assets, Shiva Balakrishna, Hyderabad

HMDA, ex director,Arrest, assets, Shiva Balakrishna, Hyderabad

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నెలలో అరెస్టయిన హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రూ.250 కోట్ల మేరకు ఆస్తులు కూడబెట్టినట్లు బుధవారం వెల్లడైంది. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉన్న ఆస్తులు అతని పేరు మీద, అతని కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట రిజిస్టర్ అయినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణలో తేలింది. 214 ఎకరాల వ్యవసాయ భూమి, 29 ప్లాట్లు, వివిధ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లలోని ఏడు ఫ్లాట్లు, ఒక విల్లాను యాంటీ గ్రాఫ్ట్ ఏజెన్సీ గుర్తించింది. ఎనిమిది రోజుల పోలీసు కస్టడీలో ఏసీబీ అతడిని ప్రశ్నించడంతో ఆస్తులను గుర్తించారు.

ఈ ఆస్తుల డాక్యుమెంట్ విలువ రూ.13.3 కోట్లు అయితే మార్కెట్ విలువ దాదాపు రూ.250 కోట్లు ఉంటుందని అంచనా. బినామీలుగా వ్యవహరిస్తున్న ముగ్గురు వ్యక్తులను కూడా దర్యాప్తు అధికారులు గుర్తించారు. బుధవారంతో పోలీసు కస్టడీ ముగియడంతో ఏసీబీ అతడిని కోర్టులో హాజరుపరచగా, చంచల్‌గూడ జైలుకు తరలించారు. అక్రమ ఆస్తులపై తదుపరి విచారణ నిమిత్తం మరోసారి అతడిని కస్టడీకి తీసుకునే యోచనలో ఏసీబీ అధికారులు ఉన్నారు. గత ఎనిమిది రోజులుగా సాగుతున్న విచారణ ఆధారంగా అతడి సోదరుడు శివ నవీన్‌కుమార్‌ను మంగళవారం ఏసీబీ అరెస్టు చేసింది. మూడు రోజుల విచారణ అనంతరం బాలకృష్ణ బినామీగా వ్యవహరిస్తున్న నవీన్‌కుమార్‌ను అరెస్టు చేసింది.

ఆయన ఇంటితోపాటు ఆయన బంధువులు, స్నేహితులు, ఇతర సన్నిహితులకు చెందిన 16 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. సోదాల్లో అతని ఇంటితోపాటు ఇతర ప్రాంతాల్లో రూ.99,60,850 నగదు, 1,988 గ్రాముల బంగారు ఆభరణాలు, 6 కిలోల వెండి ఆభరణాలు లభించాయి. బాలకృష్ణ తన బంధువులు, సహాయకుల పేర్లతో ఆస్తులు కలిగి ఉన్నట్టు పలు నేరారోపణ పత్రాలు బయటపడ్డాయి. 8.26 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. తన సర్వీసులో అవినీతికి పాల్పడి అనుమానాస్పద మార్గాల్లో ఆస్తులు సంపాదించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

అవినీతి నిరోధక చట్టం 1988 (2018లో సవరించిన విధంగా) సెక్షన్ 13(2) రీడ్, సెక్షన్ 13(1)(B) కింద ACB కేసు నమోదు చేసింది. అతని అరెస్టు తరువాత, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD) శాఖ అధికారిని సస్పెండ్ చేసింది. హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా పని చేస్తూ అక్రమ లేఅవుట్‌లకు అనుమతులు మంజూరు చేశారంటూ ఏజెన్సీకి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు.

Next Story