ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్ తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో 400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.3320 కోట్లు) పెట్టుబడులు పెట్టనుంది. హైదరాబాద్‌లో నెక్ట్స్ జనరేషన్, అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, పవర్డ్ గ్రీన్ డేటా సెంటర్ నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం దశలవారిగా పెట్టుబడులు పెట్టనుంది.
అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ సీఈవో, ఛైర్మన్ వెంకట్ బుస్సాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో విస్తరణ ప్రణాళికలను కంపెనీ ప్రకటించింది.
గత ఏడాది దాదాపు రూ.400 కోట్ల పెట్టుబడులకు తమ వార్షిక ప్రణాళికను ప్రకటించగా, ఇప్పుడు తమ ప్రణాళికలను భారీగా విస్తరించింది. 100 మెగావాట్ల అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ను స్థాపించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి దాదాపు రూ. 3320 కోట్ల పెట్టుబడులకు సిద్ధపడింది.
ఆరమ్ హైదరాబాద్‌లో ఏఐ ఆధారిత గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవటం ముఖ్యమంత్రి హర్షం ప్రకటించారు. ఈ విస్తరణ ప్రాజెక్టు వల్ల భారీగా ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. ఇప్పటికే డేటా సెంటర్ హబ్‌గా ఎదుగుతున్న హైదరాబాద్ కు ఈ పెట్టుబడులు మరింత వృద్ధిని తెచ్చిపెడుతాయని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.
తమ సంస్థ నెలకొల్పే అధునాతన డేటా సెంటర్‌తో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ సేవల మధ్య అంతరం తగ్గుతుందని సంస్థ సీఈవో, చైర్మన్ వెంకట్ బుస్సా వివరించారు. ఈ-సేవ, ఈ-పేమెంట్, ఈ -ఎడ్యుకేషన్ వంటి ప్రభుత్వ సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయని తెలిపారు.