ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఆంటనోవ్ ఏఎన్-124 రుస్లన్ హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో దిగింది. ‘రుస్లన్’గా పిలువబడే ఆంటనోవ్ ఏఎన్-124 ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కార్గో విమానాల్లో రెండో స్థానంలో ఉంది. ఈ విమానం గరిష్టంగా 150 టన్నుల వరకు కార్గోను మోయగలదు. కార్గో లోడింగ్, అన్‌లోడింగ్ సులభతరం చేయడానికి విమానం ముందు భాగం పూర్తిగా పైకి లేస్తుంది. విమానం తన ఎత్తును తగ్గించుకుని వస్తువులను వాహనాల నుంచి నేరుగా లోడ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. లోపల 30 టన్నుల బరువును ఎత్తగల క్రేన్ సిస్టమ్ కూడా ఉంది. దీని వల్ల సుదూర ప్రాంతాల్లో గ్రౌండ్ సపోర్ట్ లేకపోయినా లోడింగ్, అన్‌లోడింగ్ పనులు నిర్వహించవచ్చు. గరిష్ట ఇంధనంతో దాదాపు 14,000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు.