హైదరాబాద్ శివార్లలో కొత్త జూ పార్కును ప్లాన్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 30న రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో నగరంలో పలు అంశాలపై ఆయన చర్చించారు. హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్క్ కు ఎంతో చరిత్ర ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్క్ నిర్మాణం 1959 అక్టోబర్ 26న ప్రారంభమైన తర్వాత నాలుగు సంవత్సరాలకు అక్టోబర్ 6, 1963న ప్రారంభించారు. ఇప్పుడు మరో జూను హైదరాబాద్ పరిసరాల్లో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది.
హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్క్‌లో ప్రస్తుతం 55 జాతులకు చెందిన 664 క్షీరదాలు, 97 జాతులకు చెందిన 1227 పక్షులు, 38 జాతులకు చెందిన 341 సరీసృపాలు, 2 జాతులకు చెందిన 8 ఉభయచరాలు సహా మొత్తం 2240 జంతువులు ఉన్నాయి. జూ అనేక వలస పక్షులను ఆకర్షిస్తూ ఉంది. జంతువులను దత్తత తీసుకోవడాన్ని కూడా జూ అనుమతిస్తుంది.