హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. గ్యాస్ లీక్ కావడంతో చెలరేగిన మంటలు
హైదరాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. తాజాగా దోమలగూడలో ఉన్న రోజ్ కాలనీ వద్ద అగ్నిప్రమాదం జరిగింది.
By అంజి Published on 11 July 2023 1:31 PM ISTహైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. గ్యాస్ లీక్ కావడంతో చెలరేగిన మంటలు
హైదరాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. తాజాగా దోమలగూడలో ఉన్న రోజ్ కాలనీ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ లీకేజ్ అయ్యి ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని చీకటిమయం చేశాయి. మంటలు చెలరేగుతూ ఉండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై వెంటనే అక్కడి నుండి పరుగులు తీశారు. అయినా కూడా ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతూ ఉండటంతో, పక్కకు వ్యాపించకుండా ఉండేందుకు స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది. ప్రమాదంలో పద్మ (55), ధనలక్ష్మి (30) ,అభినవ్ (8) శరణ్య (6), విహార్ (3)లు గాయపడ్డారు. వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని బాబీ లాడ్జి దగ్గర ఉన్న ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ నెల 2వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇకనిన్న బాలానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఐడీపీఎల్ చౌరస్తాలో ఉన్న ఏ2ఏ లైఫ్ స్పేస్ అపార్ట్‌మెంట్‌లోని ఐదో ఫ్లోర్‌లో ఉన్న ఓ ఫ్లాట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెండు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.