హైదరాబాద్: సెప్టెంబర్ 19 గురువారం మిలాద్ ఉన్ నబీ ర్యాలీ సందర్భంగా చార్మినార్ సమీపంలో మంటలు చెలరేగాయి. ర్యాలీలో ఓ యువకుడు టపాసులు కాల్చడంతో డీజే సౌండ్ సిస్టమ్ జనరేటర్‌పై నిప్పురవ్వలు పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
అగ్ని మాపక సిబ్బంది వెంటనే స్పందించి, ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. మంటలను అదుపు చేసే క్రమంలో లాఠీచార్జ్ జరిగిందని వస్తున్న పుకార్లలో నిజం లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఇండియా సున్నీ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిర్వహించిన మిలాద్ ఉన్ నబీ ఊరేగింపులో చార్మినార్ సమీపంలో మంటలు చెలరేగాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పగిలిపోతున్న ఫైర్ క్రాకర్స్ జనరేటర్‌పైకి రావడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం.