అల్లు అర్జున్‌కు ఊర‌ట‌.. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్‌కు శుక్రవారం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

By Medi Samrat  Published on  3 Jan 2025 6:34 PM IST
అల్లు అర్జున్‌కు ఊర‌ట‌.. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్‌కు శుక్రవారం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంత‌కుముందు డిసెంబర్ 13న తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్‌కు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆరోజే రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది. RTC X రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో నటుడు అల్లు అర్జున్‌ ప్రత్యక్షంగా పాల్గొననందున నేరపూరిత నరహత్య ఆరోపణలు వర్తించకూడదని అల్లు అర్జున్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు జనవరి 3న తీర్పు వెలువరించనున్న‌ట్లు నిర్ణయించింది. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటీష‌న్‌పై డిసెంబర్ 27న విచారణ చేపట్టగా.. కౌంటర్ దాఖలు చేసేందుకు అదనపు సమయం కావాలని పోలీసులు కోరడంతో కోర్టు విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసింది.

డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన పుష్ప 2 తొక్కిసలాటలో భాస్కర్ అనే వ్య‌క్తి భార్య రేవ‌తి(35) మరణించగా.. ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన తర్వాత మృతురాలి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్)లోని వివిధ సెక్షన్ల కింద అల్లు అర్జున్, అతని భద్రతా బృందం, థియేటర్ యాజమాన్యంపై నగర పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబరు 13న మహిళ మృతికి సంబంధించి అల్లు అర్జున్‌ను A-11గా పేర్కొంటూ నగర పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ హైకోర్టు అదే రోజు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయ‌డంతో డిసెంబర్ 14 ఉదయం జైలు నుంచి విడుదలయ్యాడు.

సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన‌ 35 ఏళ్ల రేవతి, తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడి కుటుంబానికి నటుడు అల్లు అర్జున్ రూ.2 కోట్లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుకు చెక్కును అందజేసినట్లు అల్లు అరవింద్ మీడియాకు తెలిపారు. అల్లు అర్జున్ కోటి రూపాయలు ఇవ్వగా.. మైత్రీ మూవీస్, నిర్మాతలు 50 లక్షల రూపాయలు, చిత్ర దర్శకుడు సుకుమార్ 50 లక్షలు రూపాయలను అందించారు.

Next Story