రాత్రి 7-8 గంటలలోపు షాపులన్నీ మూసేయాల్సిందే
All commercial establishments in Old city must shut by 7-8 PM. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ ప్రస్తుతం అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 24 Aug 2022 7:42 PM ISTహైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ ప్రస్తుతం అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే..! దీంతో హైదరాబాద్ పోలీసులు పాతబస్తీ ప్రాంతంలో ఉన్న అన్ని వాణిజ్య సముదాయాలకు, ప్రతిరోజూ రాత్రి 7 నుండి 8 గంటల మధ్య మూసి వేయాలని 'ఆఫ్ ద రికార్డ్' ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఇది జరుగుతోందని సీనియర్ పోలీసు అధికారి న్యూస్‌మీటర్‌కు తెలిపారు.
మంగళవారం సాయంత్రం బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజా సింగ్ విడుదలైన తరువాత.. ఓల్డ్ సిటీ లోని కొన్ని ప్రాంతాలలో నిరసనలు చోటుచేసుకున్నాయి. 31 మంది ఆందోళనకారులను అరెస్టు చేయడంతో చార్మినార్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బుధవారం తెల్లవారుజామున పరిస్థితి అదుపులోకి వచ్చింది. బుధవారం సాయంత్రం, పోలీసు పెట్రోలింగ్ వ్యాన్‌లు కొన్ని ప్రాంతాలలో పర్యటించాయి. ప్రతిరోజూ రాత్రి 7 లేదా 8 గంటలకు షట్టర్‌లను మూసివేయాలని వాణిజ్య సంస్థలను కోరారు.
శాలిబండ వీధుల్లో 1,000 మందికి పైగా ప్రజలు నిరసన ప్రదర్శన చేశారు. పురానీ హవేలీలోని డీసీపీ సౌత్ జోన్ కార్యాలయం వద్ద కూడా ప్రజలు నిరసన తెలిపారు. పాతబస్తీ, మొగల్‌పురా, పాతరఘెట్టి, చార్మినార్, మదీనా, హైకోర్టు ప్రాంతాలలో రాత్రిపూట నిరసనలు జరిగాయి. కొంతమంది నిరసనకారులు గోషామహల్‌కు వెళ్లడానికి ప్రయత్నించారు, కానీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. రాజా సింగ్ అనుచరులతో కూడా గొడవలు జరిగాయి.
రాజా సింగ్ అనుకూల, వ్యతిరేక వర్గాల నిరసనలతో మంగళవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నాయి. రాజా సింగ్‌ను రిమాండ్‌కు పంపాలంటూ పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఓ వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే 41ఏ సీఆర్పీసీ సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాల్సి ఉందని, అయితే రాజా సింగ్‌కు అలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారంటూ కోర్టు పోలీసులను తప్పుబట్టింది. ప్రభుత్వ లాయర్లు, రాజా సింగ్ లాయర్ల మధ్య దాదాపుగా 45 నిమిషాల పాటు తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు కొనసాగాయి. రాజా సింగ్‌ను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి రాజా సింగ్ రిమాండ్ రిపోర్ట్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు.
ఆగస్టు 22 అర్ధరాత్రి, రాజా సింగ్ శ్రీ రామ్ ఛానెల్ తెలంగాణలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. అందులో అతను ప్రవక్త ముహమ్మద్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడు. హాస్యనటుడు మునావర్ ఫరూఖీ, అతని తల్లిని కూడా దుర్భాషలాడాడు. ఈ వీడియో ఆగస్టు 23 తెల్లవారుజామున 2 గంటలకు నగరంలో భారీ నిరసనలకు ఆజ్యం పోసింది. దబీర్‌పురా పోలీస్ స్టేషన్‌లో రాజా సింగ్‌పై ఫిర్యాదు నమోదైంది, కొన్ని గంటల తర్వాత రాజా సింగ్‌ను అరెస్టు చేశారు.