లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీమ్ (ఏఐఎంఐఎం) శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ పార్లమెంట్ లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ఆయన తనకు ఓటు వేయాలని కోరారు. AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తన లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ మధ్యాహ్నం బహదూర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కమాటిపురా, ఉస్మాన్‌బాగ్, బండల్‌గూడలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.
అసదుద్దీన్ ఒవైసీ పోటీ చేయనున్న హైదరాబాద్ లోక్‌సభ స్థానంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజలను కలవనున్నారు. AIMIM 1984 నుండి ఈ స్థానాన్ని గెలుచుకుంటూనే ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒవైసీ ఏకంగా ఐదు లక్షల ఓట్లు సాధించారు.రెండో స్థానంలో నిలిచిన భారతీయ జనతా పార్టీ రెండు లక్షల ఓట్లను సాధించింది. హైదరాబాద్ నుంచి పారిశ్రామికవేత్త మాధవి లతను బీజేపీ బరిలోకి దించగా, కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.