దేశంలోని పలు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు పాత రికార్డులను బద్దలు కొడుతున్నాయి. ఎండల తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల నీరు లేక నానా అవస్థలు పడుతున్నారు. అయితే ఈ వేసవిలో హైదరాబాద్‌కు ఎలాంటి నీటి కొరత లేదని జలమండలి తెలిపింది. హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చడానికి నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులలో తగినంత నీరు ఉందని హైదరాబాద్ మహానగర నీటి సరఫరా అండ్ మురుగునీటి బోర్డు (HMWS&SB) బుధవారం తెలిపింది. నగరంలోని తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రతి రోజూ 270 ఎంజీడీల నీటిని పంపింగ్ చేస్తున్నట్లు హెచ్‌ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్‌బీ పేర్కొంది. నాగార్జున సాగర్ రిజర్వాయర్, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్, ఫేజ్ I, II, III ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నారు. జలమండలి ప్రకారం.. ప్రతి నెలా 1.38 టీఎంసీల నీరు సరఫరా చేయబడుతోంది. బుధవారం నాగార్జున సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 157.61 TMC గా నమోదైంది. గత సంవత్సరం ఇదే రోజున 188.95 టీఎంసీ నుండి తగ్గింది.