తమిళనాడులో నివసిస్తున్న తెలుగు మాట్లాడే సమాజంపై ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో ప్రముఖ నటి కస్తూరి శంకర్‌ను చెన్నై పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. నవంబర్ 3న జరిగిన నిరసన కార్యక్రమంలో కస్తూరి శంకర్ విభజన వ్యాఖ్యలు చేశారని తెలుగు సంఘం దాఖలు చేసిన కేసులో పేర్కొన్నారు. "తెలుగు మాట్లాడే సమాజం రాజు భార్యకు సహాయకులుగా వచ్చి ఆ తర్వాత తమిళ వారిగా గుర్తింపు పొందారని" అమె అన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే కస్తూరి శంకర్ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బహిరంగ క్షమాపణలు చెప్పారు. “నా తెలుగు కుటుంబాన్ని బాధపెట్టడం లేదా కించపరచడం నా ఉద్దేశ్యం కాదు. అనుకోకుండా వచ్చిన వ్యాఖ్యలకు నన్ను క్షమించండి” అని ఆమె మీడియా ముఖంగా చెప్పారు. సామరస్యం అవసరమని పేర్కొంటూ ఆమె తన ప్రసంగం నుండి ప్రకటనలను కూడా ఉపసంహరించుకున్నారు. ఆమె క్షమాపణలు చెప్పినప్పటికీ, తమిళనాడు పోలీసులు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మదురై పోలీసులు తనపై పెట్టిన కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం కస్తూరి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు . తాజాగా, ఇదే అంశంపై మదురై పోలీసులు కస్తూరిపై నమోదు చేసిన కేసులో మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఆమెకు ముందస్తు బెయిల్ నిరాకరించింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాలలో తన పాత్రలకు పేరుగాంచిన కస్తూరి శంకర్, 1991లో ఆతా ఉన్ కోయిలిలే చిత్రంతో రంగప్రవేశం చేసి కమల్ హాసన్ యొక్క ఇండియన్ (1996), అన్నమయ్య (1997) చిత్రాలతో గుర్తింపు పొందారు.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమె మధురైలో బీజేపీ తరపున ప్రచారం చేసింది.