Hyderabad: ఫార్ములా -ఈ కార్ రేస్ కేసుపై విచారణ ప్రారంభించిన ఏసీబీ
ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది.
By అంజి Published on 20 Dec 2024 4:32 AM GMTHyderabad: ఫార్ములా -ఈ కార్ రేస్ కేసుపై విచారణ ప్రారంభించిన ఏసీబీ
హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఇవాళ ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫిర్యాదుదారుడు అయిన ఐఏఎస్ అధికారి దాన కిషోర్ స్టేట్‌మెంట్‌ను ఏసీబీ తీసుకోనుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో 55 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని, ప్రైవేట్ కంపెనీకి డబ్బు చెల్లించడంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడిందని ఫిర్యాదు చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1గా, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్‌ను ఏ2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కాగా ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏసీబీ ఏర్పాటు చేసింది. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ)ను అధికారులు ఏర్పాటు చేశారు.
డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో పనిచేయనున్న సీఐయూ పని చేయనుంది. ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఫార్ములా ఈ కార్ రేస్‌పై విచారణ జరగనుంది. కేసును ఎప్పటికప్పుడు ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి పర్యవేక్షించనున్నారు. ఇవాళ హెచ్ఎంటిఏ తో పాటు పలు శాఖల నుంచి ఫైల్స్‌ను ఏసీబీ తెప్పించుకొనుంది. ఎస్ ఎక్స్ కంపెనీతో ఉన్న ఒప్పందాలను ఏసీబీ పరిశీలించనుంది.
ఈ కార్ రేస్ కోసం హిమాయత్‌నగర్‌లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఎఫ్‌ఈవోకు నిధులు బదలాయించినట్టు అధికారులు గుర్తించారు. HMDAకి చెందిన రూ.54.88 కోట్లు దుర్వినియోగం అయ్యాయని, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా చెల్లింపులు జరిగాయని, ఈసీ నుంచి అనుమతులు తీసుకోలేదని ఏసీబీ పేర్కొంది. 2023 అక్టోబర్ 30న మళ్లీ FEOతో అగ్రిమెంట్ చేసుకుందని, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అనుమతి తీసుకోలేదని, అగ్రిమెంట్ లేకుండానే HMDA నిధులు వినియోగించారని ఏసీసీ వెల్లడించారు. చెల్లింపుల తర్వాత అగ్రిమెంట్ చేసుకున్నారని, ఫారిన్ ఎక్స్ఛేంజ్ నిబంధనలు ఉల్లంఘించారని ఏసీబీ పేర్కొంది.