Hyderabad : రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్‌ఈ

హైదరాబాద్ నగరంలోని జీహెచ్ఎంసీ కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది

By -  Knakam Karthik
Published on : 4 Feb 2026 2:05 PM IST

Hyderabad News, Kukatpally Zonal Office, ACB, Superintendent Engineer, ACB Raids, Corruption, GHMC

హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం..రూ.15 లక్షలు లంచంతో పట్టుబడ్డ ఎస్‌ఈ

హైదరాబాద్ నగరంలోని జీహెచ్ఎంసీ కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కూకట్‌పల్లి జోన్‌లో సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ)గా పనిచేస్తున్న చిన్నారెడ్డి రూ.15 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌ గా పట్టుబడ్డారు. నిర్మాణ అనుమతులు, బిల్లుల మంజూరు విషయంలో లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించారు. లంచం తీసుకుంటున్న సమయంలో చిన్నారెడ్డిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు, వెంటనే కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు.

ఆయన కార్యాలయ గదితో పాటు కీలక ఫైళ్లు, పత్రాలు, కంప్యూటర్లను పరిశీలించి సంబంధిత ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో జీహెచ్ఎంసీ వర్గాల్లో కలకలం రేగింది. ప్రాథమిక విచారణలో చిన్నారెడ్డి తరచుగా లంచాలు వసూలు చేస్తున్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఆయన అక్రమ ఆదాయ మార్గాలు, స్థిర–చరాస్తులపై కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. అవసరమైతే నివాసాలు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించే అవకాశముందని సమాచారం. ఈ ఘటనపై చిన్నారెడ్డిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

Next Story