హైదరాబాద్: తెలంగాణ డీజీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. పోలీసులు అయ్యప్ప దీక్ష దుస్తులు ధరించడంపై విడుదలైన ఆదేశాలపై బీజేపీ కార్యకర్తలు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడికి వచ్చిన అయ్యప్ప స్వాములు, పోలీసుల మధ్య తోపులాట ఏర్పడింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
కాగా అయ్యప్ప మాల కోసం యూనిఫాం నిబంధనల్లో వెసులుబాటు ఇవ్వలేమంటూ హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం ఇచ్చిన లేఖ చర్చకు దారి తీసింది. 2025 నవంబర్ 20వ తేదీతో ఉందీ లేఖ. అయ్యప్ప మాల వేసుకునేందుకు వీలుగా యూనిఫాం నిబంధనల్లో వెసులుబాటు కల్పించాలని కంచన్‌బాగ్ స్టేషన్‌కి చెందిన ఎస్సై ఎస్. కృష్ణకాంత్ కోరారు. "అప్పటికే తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి ఉన్న ఉత్తర్వుల ప్రకారం, అలా వెసులుబాటు కల్పించడం కుదరదు" అంటూ దానికి సమాధానం ఇచ్చారు సౌత్ ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ కె శ్రీకాంత్. ఇదే సమాధానాన్ని కృష్ణకాంత్‌తో పాటు ఆ జోన్ పరిధిలోని అన్ని స్టేషన్లకూ పంపారు...దీంతో వివాదం ఏర్పడింది.