ఏఐఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అస్సాసుద్దీన్ ఒవైసీపై రెచ్చగొట్టెలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత సాయిరామ్ యాదవ్ అలియాస్ లడ్డూ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. లడ్డూ యాదవ్‌పై అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఐపిసి సెక్షన్ 341, 188, 504 కింద కేసు నమోదైంది. బేగంబజార్ ఛత్రిలోని భగీరథి పూజా దుకాణం ముందు లడ్డూ యాదవ్ అనుమతి లేకుండా వేదికను నిర్మించారని పోలీసులు తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా తిరంగా ర్యాలీ నిర్వహించడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని తెలిపారు.
సోమవారం ఉదయం 10 గంటలకు ర్యాలీ ప్రారంభం కాగా, ప్రజలు గుమిగూడడంతో ఆ ప్రాంతంలో రహదారిని దిగ్బంధించారు. అదే సమయంలో ఎంపీ అస్సాసుద్దీన్ ఒవైసీ అటువైపు నుంచి వెళుతుండగా, లడ్డూ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని పోలీసులు తెలిపారు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. అఫ్జల్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ ఎం రవీందర్ రెడ్డికి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నుంచి బీజేపీ నేత లడ్డూ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎంఎస్ మెసేజ్ వచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇవాళ ఉదయం లడ్డూ యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.