హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వనస్థలిపురంలోని వీఐపీ స్టోర్స్ షాప్‌లో ఇవాళ ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు సమాచారం. భారీ ఎత్తున మంటలు చెలరేగుతూ ఉండడంతో దట్టమైన పొగలు ఆ ప్రాంతం చుట్టూ అలుముకున్నాయి. పైకి ఎగసిపడుతున్న మంటలు, పొగలను చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురై అక్కడి నుండి పరుగులు తీశారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజన్లతో డిఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
రెండు ఫైర్ ఇంజన్లతో దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షాపు అగ్ని ప్రమాదానికి గురైందన్న విషయం తెలుసుకున్న యజమాని ఘటనా స్థలానికి చేరుకొని లబోదిపోమంటూ బోరున విలపించారు. సుమారు 15 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లుగా షాపు యజమాని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో పలుచోట్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఇళ్ల మధ్యలోనే కంపెనీలు, గోదాములు ఉండడంవల్ల అందులో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.