హైదరాబాద్ నగరంలో రాయదుర్గంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రాండ్ స్పైసీ బావర్చి హోటల్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటల దాటికి హోటల్‌లోని సిబ్బంది, ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
యాక్షన్ గార్డింగ్ ప్రైవేటు లిమిటెడ్ సిబ్బందికి కేటాయించిన కార్యాలయంలో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో అక్కడ 15 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా భవనం పైభాగానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు క్రేన్ వారిని కిందకు తీసుకువచ్చారు. దట్టమైన పొగ కారణంగా ఊపిరిఆడక ఇబ్బంది పడిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు హోటల్ సిబ్బంది చెబుతున్నారు.
ఇంకా భవనంలో ఎవరైనా చిక్కుకున్నారేమోనని గాలిస్తున్నారు. తొలుత రెండో అంతస్తులో మంటలు చెలరేగి పై అంతస్తులకు వ్యాపించినట్లు అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. మంటలు వ్యాపించగానే రెండో అంతస్తులోని వారు కిందకు పరుగులు తీయగా.. పై అంతస్తులోని వారు భవనంపైకి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంబంధి భారీ స్కై లిఫ్ట్ సాయంతో వారిని కిందకు తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు.