హైదరాబాద్ లో బీజేపీ-టీఆర్ఎస్ హోర్డింగ్ వార్

A hoarding war between TRS and BJP.హైదరాబాద్‌లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ముందు నగరంలో హోర్డింగ్ వార్ మొదలైంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 July 2022 6:46 AM GMT
హైదరాబాద్ లో బీజేపీ-టీఆర్ఎస్ హోర్డింగ్ వార్

హైదరాబాద్‌లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ముందు నగరంలో హోర్డింగ్ వార్ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నగరాన్ని పలు హోర్డింగ్‌లతో నింపేశాయి. నగరంలో పలుచోట్ల బీజేపీ హోర్డింగ్‌లు, ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలతో కూడిన కటౌట్లు ఉండగా, ఇంకొన్ని చోట్ల మోదీ వ్యతిరేక హోర్డింగ్‌లు కూడా వెలిశాయి.

రోడ్ల పక్కన మరియు మెట్రో పిల్లర్ల దగ్గర ప్రధాని మోదీ, ఇతర బీజేపీ నేతల ఫోటోలతో కూడిన బీజేపీ హోర్డింగ్‌లు ఉంచబడ్డాయి. చాలా బీజేపీ బ్యానర్‌లు బిల్‌బోర్డ్‌లపై లేవు.. స్టాండ్‌లోన్ కటౌట్‌లుగా ఉంచబడ్డాయి. GHMC పరిమితుల్లో అన్ని మెట్రో పిల్లర్లు, ఇతర అడ్వర్టైజింగ్ స్పాట్‌లను బుక్ చేసుకోవడానికి 23 కోట్లు టీఆర్‌ఎస్‌ ఖర్చు చేసిందని బీజేపీ ఆరోపించింది.

జూలై 2 మరియు 3 తేదీల్లో నగరాన్ని సందర్శించడానికి ప్రధాని మోదీ వస్తుండగా.. ఆయన పాలనను విమర్శిస్తూ నగరంలోని పలు ప్రాంతాలలో అనేక బిల్ బోర్డులు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్ విమానాశ్రయంలో దిగిన తర్వాత ప్రధానమంత్రి, ఇతర బీజేపీ సభ్యులు వెళ్లే మార్గాల వెంబడి వ్యూహాత్మకంగా మోదీ వ్యతిరేక హోర్డింగ్‌లు ఉంచబడ్డాయి. మోదీ దేశాన్ని దోచుకుంటున్నారని ఆరోపిస్తూ ఎల్‌బీ నగర్‌లో భారీ హోర్డింగ్‌ పెట్టారు. ఈ హోర్డింగ్‌లో మనీ హీస్ట్ టీవీ షో ఫోటో ఉంది. "మిస్టర్ ఎన్. మోదీ, మేము బ్యాంకులను మాత్రమే దోచుకుంటాము, మీరు మొత్తం దేశాన్ని దోచుకుంటారు" అని హోర్డింగ్ లో ఉంది.

ఇంకొన్ని హోర్డింగ్ లలో "భారత రాష్ట్రపతిగా శ్రీ యశ్వంత్ సిన్హా జీకి మేము మద్దతు ఇస్తున్నాము" అని ఉన్నాయి. బ్యానర్‌లో యశ్వంత్ సిన్హా, తెలంగాణ సిఎం కె. చంద్రశేఖర రావు, తెలంగాణ ఎంఏ అండ్ యుడి మంత్రి కెటి రామారావు, శేర్లింగంపల్లె ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, చేవెళ్ల ఎంపి గడ్డం రంజిత్, టిఆర్‌ఎస్ మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాసరావు చిత్రాలు కూడా ఉన్నాయి. హైటెక్ సిటీ ఫ్లైఓవర్ దగ్గర, ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగే ప్రదేశానికి దగ్గరలో ఈ హోర్డింగ్ పెట్టారు.

అసభ్య పదజాలాన్ని ఉపయోగించిన కొన్ని బ్యానర్లపై తాము ఫిర్యాదు చేసినట్లు హైదరాబాద్‌లోని బీజేపీ న్యాయవాద బృందం సభ్యుడు భార్గవ్ రామ్ నీలం తెలిపారు. "మేము కంటోన్మెంట్ బోర్డుపై ఫిర్యాదు చేసాము. అటువంటి అభ్యంతరకరమైన బ్యానర్లు చాలా తొలగించబడ్డాయి," అని చెప్పుకొచ్చారు. మనీ హీస్ట్ బిల్‌బోర్డ్‌పై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదు. #ByeByeModi హ్యాష్‌ట్యాగ్, "సాలు మోడీ, సంపకు మోడీ" అనే నినాదంతో కూడిన అనేక బిల్‌బోర్డ్‌లు, బ్యానర్‌లు ఇప్పటికీ ఉన్నాయి. బిల్‌బోర్డ్‌లతో పాటు, టీఆర్‌ఎస్ కూడా బీజేపీ కాషాయ బ్యానర్‌ల తరహాలో కటౌట్‌లను ఏర్పాటు చేసింది. గచ్చిబౌలిలోని ఓఆర్‌ఆర్ ఎదురుగా ఉన్న జంక్షన్‌కు సమీపంలో కొన్ని జంక్షన్‌లలో వాటిని ఉంచింది. (ఈ దారి గుండా ప్రధాని మోదీ వస్తున్నారు.)

Next Story