Hyderabad: కావాలనే గొడవ పెట్టుకుని.. దృష్టి మరల్చి డబ్బు కాజేస్తున్న ముఠా అరెస్ట్‌

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులను అటకాయించి గొడవకు దిగడంతో పాటు సినీ ఫక్కీలో వారి దృష్టి మరల్చి డబ్బులు తస్కరిస్తున్న ముఠా సభ్యులను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

By అంజి  Published on  3 Sep 2023 6:36 AM GMT
Hyderabad, Filmnagar, extorting money, Crime news

Hyderabad: కావాలనే గొడవ పెట్టుకుని.. దృష్టి మరల్చి డబ్బు కాజేస్తున్న ముఠా అరెస్ట్‌

హైదరాబాద్‌: రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులను అటకాయించి గొడవకు దిగడంతో పాటు సినీ ఫక్కీలో వారి దృష్టి మరల్చి డబ్బులు తస్కరిస్తున్న ముఠా సభ్యులను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్‌కు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి గౌతమ్ యాదవ్(32) అనే వ్యక్తితో పాటు పని చేస్తున్న యువతి సబ్జా కాలనీలో నివాసం ఉంటోంది. గత నెల 31న రాత్రి 9.30 ప్రాంతంలో ఆమెతో పాటు కారులో తోడుగా వెళ్లిన గౌతమ్ ఆమె ఇంటివద్ద కారు దిగి తన స్నేహితుడి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. కొంతదూరం రాగానే రోడ్డుపై కాపుకాసిన హకీంషా, సమీపంలో నివాసం ఉండే అఫ్రోజాన్(24) అనే ఆటో డ్రైవర్, మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన సయ్యద్ ఇబ్రహీం ఖలీలుల్లా(20), పారామౌంట్ కాలనీలో నివాసం ఉంటూ ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న అహ్మదాబాన్(21)లు అడ్డుకున్నారు.

ఈ సమయంలో ఎందుకు యువతితో కలిసి వచ్చావంటూ ప్రశ్నించాడు. ఒంటరిగా వస్తున్న స్నేహితురాలిని ఇంటివద్దకు దింపేందుకు వచ్చానని చెప్పినా వినిపించుకోకపోవడంతో వాగ్వాదం జరిగింది. అతడి చేతిలో ఓ బ్యాగ్ ఉండటంతో దాన్ని కాజేయాలని నిర్ణయించుకున్న ముగ్గురు నిందితులు బైక్‌పై అతడిని వెంబడించారు. సుమారు కిలోమీటర్ తర్వాత అంబేద్కర్ నగర్ ప్రాంతానికి రాగానే బైకులతో గౌతమ్ యాదవ్‌ని అడ్డగించారు. గట్టిగా కేకలు వేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేసిన అఫ్రోజ్, ఇబ్రహీం, అహ్మద్ ఖాన్లు అక్కడున్న జనాన్ని పోగు చేశారు. దీంతో గందరగోళం నెలకొంది. అప్పటికే యాదవ్‌ చేతిలో రూ. 4లక్షల నగదుతో ఉన్న బ్యాగును నిందితులు మాయం చేశారు.

ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను అదుపు లోకి తీసుకుని ప్రశ్నించగా దృష్టి మరల్చి డబ్బులు తస్కరించినట్లు అంగీకరించారు. ప్రధాన నిందితుడు అఫ్రోజ్‌పై గతంలో రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న వారిని బెదిరించి డబ్బులు వసూలు చేయడం, చైన్‌ స్నాచింగ్‌, మొబైల్ స్నాచింగ్స్ తదితర 10 కేసులు ఉన్నాయి. అహ్మద్ ఖాన్‌పై హత్యకేసు ఉన్నట్లు తేలింది. నిందితులను అరెస్ట్ చేసిన ఫిలింనగర్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.2.40లక్షల నగదుతో పాటు 3 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా చోరీ చేసిన డబ్బుల్లో కొంత ఖర్చు చేశారు.

Next Story