హైదరాబాద్‌లో తప్పిన పెను ప్రమాదం..ప్రైవేట్ స్కూల్‌ బిల్డింగ్ సెల్లార్‌లో మంటలు

మదీనాగూడలోని నారాయణ స్కూల్‌లో అగ్నిప్రమాదం జరిగింది

By -  Knakam Karthik
Published on : 10 Feb 2026 3:18 PM IST

Hyderabad, Miyapur, Madinaguda, Fire Accident, Narayana School

హైదరాబాద్‌లో తప్పిన పెను ప్రమాదం..ప్రైవేట్ స్కూల్‌ బిల్డింగ్ సెల్లార్‌లో మంటలు

హైదరాబాద్‌లోని మదీనాగూడలో ఉన్న నారాయణ పాఠశాల భవనంలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో పాఠశాల పరిసరాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. బిల్డింగ్ లోని సెల్లార్ లో మంటలు ఎగిసిపడ్డాయి. బిల్డింగ్ మొత్తం దట్టమైన పొగ కమ్మేయడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

పాఠశాల భవనంలోని సెల్లార్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన నల్లటి పొగలు భవనం మొత్తాన్ని కమ్మేశాయి. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులందరినీ ఉపాధ్యాయులు, సిబ్బంది అత్యంత వేగంగా భవనం వెనుక వైపు నుంచి సురక్షితంగా బయటకు తరలించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సెల్లార్‌లో ఉన్న పాత సామాగ్రి లేదా ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై ఆరాతీస్తున్నారు.

Next Story