హైదరాబాద్‌లోని జియాగూడలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఒక కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. సిటీ కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ (గోల్కొండ టీమ్) మరియు కుల్సుంపురా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో, వెంకటేష్ నగర్‌లోని ఒక ఇంట్లో ఎటువంటి అనుమతులు లేకుండా, అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో పచ్చళ్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
ఈ అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న కె. రవీందర్ (62) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కుళ్లిపోయిన మామిడికాయలు, నిమ్మకాయలను తక్కువ ధరకే కొనుగోలు చేసి, రాళ్ల ఉప్పుతో నిల్వ ఉంచి, నాణ్యత లేని ముడి పదార్థాలతో ప్రమాదకరమైన పచ్చళ్లను తయారు చేస్తున్నట్లు తేలింది.
ఈ దాడుల్లో సుమారు రూ. 3 లక్షల విలువైన 15 డ్రమ్ముల ఎర్ర మిర్చి పచ్చడి, 13 డ్రమ్ముల మామిడి ముక్కలు, టమాటా, ఉసిరి, నిమ్మకాయ పచ్చళ్లతో సహా మొత్తం 9,000 కిలోల కల్తీ నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఈ ప్రమాదకరమైన పచ్చళ్లను నగరంలోని వివిధ కిరాణా షాపులు, హోటళ్లు మరియు రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడిపై కుల్సుంపురా పోలీస్ స్టేషన్‌లో కొత్త చట్టం (BNS) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.