9 నెలల బాబుకు వేడినీళ్లు పడి తీవ్ర గాయాలు.. విజయవంతంగా చికిత్స
9 months old baby was seriously injured by hot water successfully treated. ఇళ్లలో వేడినీళ్లు పడటం వల్ల చర్మం పొలుసులుగా విడిపోవడం ఇటీవల బాగా పెరిగింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Feb 2023 5:29 PM ISTహైదరాబాద్, ఫిబ్రవరి 14, 2023: ఇళ్లలో వేడినీళ్లు పడటం వల్ల చర్మం పొలుసులుగా విడిపోవడం ఇటీవల బాగా పెరిగింది. నీటి వేడిని బట్టి, ఆ నీళ్లు ఎంతసేపు ఒంటిమీద ఉన్నాయన్నదాన్ని బట్టి, పిల్లలు వేసుకున్న దుస్తులను బట్టి ఆ గాయాలు ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్ గాయాలలో ఏవైనా కావచ్చు. హైదరాబాద్ నగరానికి చెందిన 9 నెలల బాబు మీద ప్రమాదవశాత్తు వేడినీళ్లు పడటంతో సుమారు 30-35% కాలిన గాయాలయ్యాయి. ఆ బాబును చికిత్స కోసం నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన అమోర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అతడి సమస్యను, అందించిన చికిత్స విధానాన్ని ఆస్పత్రికి చెందిన ప్లాస్టిక్, రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ కన్సల్టెంట్ డాక్టర్ బాదం అభినందన్ వివరించారు.
‘‘బాబుకు మాడు, మెడ, వీపు, రెండు చేతులు, చంకలు కాలాయి. అవన్నీ సెంకడ్ గ్రేడ్ గాయాలని.. చర్మం లోపలివరకు కాలిందని పరీక్షల్లో గుర్తించాము. వెంటనే బాబును ఆస్పత్రిలోని బర్న్స్ ఐసొలేషన్ వార్డులోకి తరలించి, వెంటనే చికిత్స ప్రారంభించాం. 20% కంటే ఎక్కువ కాలిన గాయాలైతే రక్తం పరిమాణం తగ్గడం, ఎండ్ ఆర్గాన్ పెర్ఫ్యూజన్ వల్ల షాక్‌కు కారణమవుతాయి. కాలిన గాయాలు అయిన రోగుల్లో ఫ్లూయిడ్లను పునరుద్ధరించడం వాళ్ల ప్రాణరక్షణలో చాలా కీలకం. ఇందులో ఆలస్యం జరిగినా, లేదా తగినంతగా పునరుద్ధరించకపోయినా వివిధ అవయవాలు విపలమై, చివరకు మరణం సంభవిస్తుంది. పిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. వాళ్లకు ఫ్లూయిడ్లు కాస్త ఎక్కువైనా, తక్కువైనా చాలా ప్రమాదకరం. తగినంతగా పునరుద్ధరిస్తూ, అదే సమయంలో మూత్రవిసర్జన తగినంతగా ఉండేలా చూసుకుంటూ.. అదే సమయంలో పిల్లల వైద్య నిపుణులు, క్రిటికల్ కేర్ బృందం సాయంతో ఇతర పారామీటర్లన్నింటినీ కాపాడుకుంటూ వచ్చాం. అదేసమయంలో ఇన్ఫెక్షన్లు వ్యాపించకుండా యాంటీబయాటిక్స్ కూడా ఇచ్చాం.
ఫ్లూయిడ్లను తగినంతగా పునరుద్ధరించాక, గాయాలను సరిగా అంచనా వేసేందుకు బాబును ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లాం. అక్కడ గాయాలకు చికిత్స చేయడం పెద్ద సవాలు. చర్మానికి ప్రత్యామ్నాయంగా సరికొత్త డ్రసింగ్ టెక్నిక్ పాటించాం. ఈ కేసులో మేం బొవైన్ ఆధారిత ఎక్స్‌ట్రా సెల్యులర్ మాట్రిక్స్ నేటివ్ కొలాజెన్ మెంబ్రేన్‌ను ఉపయోగించాం. కొలాజెన్ వేయడానికి బాబును మత్తులో ఉంచి, గాయాలను పూర్తిస్థాయిలో శుభ్రం చేశాం. గాయాల నుంచి ఫ్లూయిడ్ గానీ, ప్రోటీన్లు గానీ పోకుండా ఉండేలా కొలాజెన్ కాపాడుతుంది. దీనివల్ల డ్రసింగ్ ఎక్కువ అక్కర్లేదు, అలాగే నొప్పి నివారణ మందులు, యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం తక్కువ. సెప్టిసీమియా లాంటి ఇతర సమస్యలు రాకుండా కాపాడుతుంది. శస్త్రచికిత్స తర్వాత బాబును.. అతడి తల్లిని ఒక ఐసొలేషన్ గదిలో ఉంచి, బాబుకు నోటిద్వారా ఆహారం ఇవ్వాలని సూచించాం. దానివల్ల గాయాలు త్వరగా మానుతాయి. ఆస్పత్రిలో చేరిన మూడోరోజున బాబు గాయాలను మళ్లీ పరిశీలించాం. వేసిన కొలాజెన్ బాగానే అతుక్కుని ఉండగా, మిగిలిన చిన్న గాయాలు శుభ్రం చేసి, సిల్వర్ బేస్డ్ కొలాజెన్ ఆయింట్‌మెంట్ రాశాం. ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకపోవడంతో 5వ రోజు ఐసొలేషన్ నుంచి బయటకు తీసుకొచ్చి, పదోరోజు డిశ్చార్జి చేశాం.
కొలాజెన్ వాడే సరికొత్త టెక్నిక్ కారణంగా రోగులకు ఆర్థికభారం చాలా తగ్గుతుంది, ఆస్పత్రిలో ఉండాల్సిన సమయం తగ్గుతుంది. వైద్యులు, నర్సులకు సైతం గాయాల సంరక్షణ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. మొత్తమ్మీద చికిత్స వ్యయం కూడా చాలా తక్కువగా ఉంటుంది. డిశ్చార్జి చేసిన నాలుగు రోజుల తర్వాత ఫాలో-అప్ కోసం బాబు వచ్చాడు. లోపలి గాయాలన్నీ పూర్తిగా నయం అవుతుండటంతో కొలాజెన్ నెమ్మదిగా ఊడిపోతోంది’’ అని డాక్టర్ బాదం అభినందన్ తెలిపారు.