పాక్ జలసంధిని ఈది రికార్డు సృష్టించిన హైదరాబాద్ మహిళ

47 Year old Hyderabad woman Syamala Goli swims across palk strait.మ‌నిషికి కృషి ప‌ట్టుద‌ల ఉంటే ఏదైనా సాధించ‌వ‌చ్చు అని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 March 2021 5:26 AM GMT
పాక్ జలసంధిని ఈది రికార్డు సృష్టించిన హైదరాబాద్ మహిళ

మ‌నిషికి కృషి ప‌ట్టుద‌ల ఉంటే ఏదైనా సాధించ‌వ‌చ్చు అని నిరూపించింది ఓ తెలుగు మ‌హిళ‌. 47 వ‌య‌సులో భార‌త్‌-శ్రీలంక మ‌ధ్య‌నున్న పాక్ జ‌ల‌సంధిని ఈది అంద‌రి చేత శ‌భాష్ అని నిరూపించుకుంది ఈ నారీమ‌ణి. 30కి.మీ పొడవు ఉన్న ఈ జ‌ల‌సంధిని హైద‌రాబాద్‌కు చెందిన గోలి శ్యామ‌ల 13 గంట‌ల 43 నిమిషాల్లోనే ఈది తొలి తెలుగు మ‌హిళ‌గా రికార్డు సృష్టించింది. ప్ర‌పంచంలో రెండో మ‌హిళ‌గా రికార్డుల‌కెక్కారు. శ్రీలంక తీరం నుంచి శుక్రవారం ఉదయం 4.15 గంటలకు బయల్దేరిన ఆమె సాయంత్రం 5.58 గంటలకు రామేశ్వరంలోని ధనుష్‌కోటి చేరుకున్నారు. 2012లో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రాజీవ్‌ త్రివేది పాక్‌ జలసంధిని 12 గంటల 30 నిమిషాల్లో ఈదిన సంగతి తెలిసిందే. ఆయనే శ్యామలకు ఈతలో మెళకువలు నేర్పి, మెరుగైన శిక్షణ ఇప్పించారు.

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన శ్యామలది మధ్యతరగతి రైతుకుటుంబం. తండ్రి కంటె వెంకటరాజు ఒకప్పుడు వెయిట్‌ లిఫ్టర్‌. తాను క్రీడారంగంలో ఉన్నప్పటికీ పిల్లలను మాత్రం వాటికి దూరంగా ఉంచాలని ఆయన భావించారు. శ్యామలను ఐఏఎస్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ చదువుపై అంతగా ఆసక్తిలేని శ్యామల.. చిత్రకళపై దృష్టిసారించి యానిమేటర్‌ అయ్యారు. మా జూనియర్స్‌ చానల్‌లో యానిమేషన్‌ సిరీస్‌ చేశారు.

లిటిల్‌ డ్రాగన్‌ అనే యానిమేషన్‌ సినిమా కూడా తీశారు. అయితే.. ఆ సినిమాతో ఆర్థికంగా నష్టపోయారు. దీంతో యానిమేషన్‌కు విరామిచ్చారు. అనంతరం 44 ఏళ్ల వయసులో స్విమ్మింగ్‌ నేర్చుకుని మరో కెరీర్‌కు శ్రీకారం చుట్టారు. పలు ఈవెంట్లలో పాల్గొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించారు. గతంలో హుగ్లీలో 14 కిలోమీటర్లు ఈది విజేతగా నిలిచారు. ఈ క్రమంలోనే తాజాగా పాక్‌ జలసంధిని విజయవంతంగా అధిగమించి కొత్త రికార్డు సృష్టించారు.




Next Story