గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని ప్ర‌యాణీకుల‌కు, పుస్త‌క‌ప్రియుల‌కు టీఎస్ఆర్టీసీ శుభ‌వార్త చెప్పింది. న‌గ‌రంలోని ఎన్టీఆర్ మైదానంలో జ‌రుగుతున్న పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌కు సాధ్యమైనంత ఎక్కువ మంది సందర్శించి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాల‌నే ఉద్దేశంలో కీల‌క ప్ర‌క‌ట‌న జారీ చేసింది. రూ. 100 టికెట్‌పై 20 శాతం రాయితీని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు తెలంగాణ ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ సోష‌ల్ మీడియా ద్వారా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. నగరంలో 24గంటల టికెట్‌(డేపాస్‌) పై ఈ నెల 27 వరకు తగ్గింపు పొందవచ్చున‌ని తెలిపారు. గతంలో మాదిరి కాకుండా.. ఈరోజు ఏ సమయానికి ఈ టికెట్‌ కొనుగోలు చేస్తారో.. మరుసటి రోజు అదే సమయం వరకు దీనిని వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రయాణికులు దీనిని వినియోగించుకోవాల‌ని సూచించారు.


ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తకాల పండుగ డిసెంబ‌ర్ 18న‌(శనివారం) ప్రారంభ‌మైంది. ఈ నెల 27 వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. క‌రోనా నిబంధనలు పాటిస్తూ.. బుక్ ఫెయిర్‌ను నిర్వ‌హిస్తున్నారు. మాస్కులు ధ‌రించిన వారినే లోనికి అనుమ‌తిస్తున్నారు. తెలుగు, తమిళం, మళయాళం, హిందీ, ఇంగ్లీష్ తో పాటు పలు భాషలకు చెందిన పుస్తకాలను ప్రదర్శనలో ఉంచారు. ప్రతి రోజు మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 8.30 వరకు.. శని, ఆదివారాలు, సెలవుల్లో మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 9గంటల వ‌ర‌కు బుక్ పెయిర్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story