Hyderabad: పాఠశాలలో యాసిడ్ ఫ్యూమ్.. ఆస్పత్రి పాలైన 15 మంది విద్యార్థులు

చింతల్‌లోని శ్రీ చైతన్య స్కూల్‌లోని మూడో అంతస్థులోని వాష్‌రూమ్‌లో యాసిడ్‌ కిందపడింది. దీంతో ఒక్కసారిగా ఘాటు వాసన వెదజల్లింది.

By అంజి  Published on  8 Dec 2024 7:31 AM IST
Students Hospitalised, Acid Fume, Hyderabad,  School

Hyderabad: పాఠశాలలో యాసిడ్ ఫ్యూమ్.. ఆస్పత్రి పాలైన 15 మంది విద్యార్థులు

హైదరాబాద్: చింతల్‌లోని శ్రీ చైతన్య స్కూల్‌లోని మూడో అంతస్థులోని వాష్‌రూమ్‌లో యాసిడ్‌ కిందపడింది. దీంతో ఒక్కసారిగా ఘాటు వాసన వెదజల్లింది. యాసిడ్‌ పొగలు పీల్చి 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సమీపంలోని తరగతి గదికి పొగలు వ్యాపించడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిర్వాహకులు వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఒక వీడియోలో, ఒక విద్యార్థి తన వాంతిలో రక్తం ఉందని పంచుకున్నాడు. ఈ ఘటనపై తమకు సమాచారం ఇవ్వకపోవడంపై స్కూల్‌ యాజమాన్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. స్కూల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో ఇది పాఠశాల వెలుపల నిరసనలకు దారితీసింది.

విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని, తల్లిదండ్రులతో కలిసి ఇంటికి పంపించామని ప్రిన్సిపాల్ భార్గవి తెలిపారు. ఈ ఘటనపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. జీడిమెట్ల స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి. మల్లేష్ మాట్లాడుతూ.. ''వాష్‌రూమ్ టైల్స్‌ను శుభ్రం చేయడానికి ఉపయోగించే యాసిడ్ వల్ల బలమైన పొగలు, మంటలు ఏర్పడ్డాయని మాకు మధ్యాహ్నం 12.30 గంటలకు కాల్ వచ్చింది, దీని వల్ల చాలా మంది విద్యార్థులు ఊపిరితో ఇబ్బంది పడ్డారు. దాదాపు 20-25 మంది పిల్లలు ప్రభావితమయ్యారు'' అని తెలిపారు.

పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 125(ఏ), 286 కింద కేసు నమోదు చేసి ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. బాధిత విద్యార్థులు నిలకడగా ఉన్నారని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని వారు తెలిపారు. భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పాఠశాలను హెచ్చరించారు. పరిస్థితిని అదుపు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు జీడిమెట్ల పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు విచారణ జరిపించాలని కోరారు.

Next Story