శంషాబాద్ ఎయిర్ పోర్టులో క‌రోనా క‌ల‌క‌లం.. విదేశాల నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన 13 మందికి క‌రోనా

12 International passengers tests COVID-19 positive at Hyderabad airport.క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భ‌యాందోళ‌న‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Dec 2021 6:49 PM IST
శంషాబాద్ ఎయిర్ పోర్టులో క‌రోనా క‌ల‌క‌లం.. విదేశాల నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన 13 మందికి క‌రోనా

క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భ‌యాందోళ‌న‌లు వెంటాడుతున్న వేళ విదేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణీకుల‌కు ఆర్‌టీపీసీఆర్ ప‌రీక్ష‌లు త‌ప్ప‌నిస‌రి చేశారు. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో క‌రోనా క‌ల‌క‌లం రేపింది. విదేశాల నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన వారిలో 12 మందికి క‌రోనా ప‌రీక్ష‌ల్లో పాజిటివ్ గా తేలింది. వెంట‌నే వారిని గ‌చ్చిబౌలిలోని టిమ్స్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. 12 మంది ప్రయాణికుల్లో యూకే నుంచి తొమ్మిది మంది, సింగపూర్‌, కెనడా, అమెరికా నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.

వీరికి ఒమిక్రాన్ సోకిందా లేదా అనేది తెలుసుకోవ‌డానికి వీరంద‌రి న‌మూనాల‌ను సేక‌రించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. వీరిలో ఒమిక్రాన్ నిర్థార‌ణ కాక‌పోతే.. అంద‌రినీ హోం ఐసోలేష‌న్‌కు పంప‌నున్నారు. నిన్న బ్రిట‌న్ నుంచి వ‌చ్చిన రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్ తేలిన సంగ‌తి తెలిసిందే. నిన్న, ఈరోజు విదేశాల నుంచి వ‌చ్చిన వారిలో క‌రోనా పాజిటివ్ గా తేలిన వారి సంఖ్య 13కు చేరింది.

ఒమిక్రాన్ వేరియంట్‌ను తొలుత ద‌క్షిణాఫ్రికాలో గుర్తించారు. నెల రోజులు కాక‌ముందే దాదాపు 30 పైగా దేశాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీనిపై ఇప్ప‌టికే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ 6 రెట్లు వేగంగా సంక్ర‌మిస్తుంద‌ని తెలిపింది. ఇక భార‌త్‌లోనూ నిన్న రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. బెంగళూరులో రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను గుర్తించినట్లు కేంద్రం అధికారిక ప్రకటన చేసింది.

ఇదిలా ఉంటే.. ఈ ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా అంతా ప్ర‌మాద‌క‌రం అవునా..? కాదా అన్న దానికి ప్ర‌స్తుతానికి స‌మాధానం లేదు. ప్ర‌స్తుతం దీనిపై శాస్త్రవేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. అయితే.. డెల్టాతో పోలిస్తే 6 రెట్ల వేగంగా వ్యాపిస్తున్న‌ట్లు మాత్రం చెబుతున్నారు. యువ‌త‌కు ఎక్కువ‌గా ఒమిక్రాన్ సోకుతోంది.

Next Story